YS Vivekananda Reddy: దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. గత ఎన్నికలకు ముందు ఏపీలో సంచలనం రేపిన వివేకా హత్య కేసులో సీఎం వైఎస్ జగన్ తమ్ముడు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చడం తెలిసిందే. అలాగే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం కలకలం రేపింది. భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉండగా.. కోర్టు కొద్దిరోజులపాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చారు. బెయిల్ గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఆయన జైల్లో సరెండర్ కానున్నారు. ఇక ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరగ్గా.. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు ఊరట లభించింది.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రతీ వారం సీబీఐ ముందు విచారణకు హాజరవుతున్నారు. దీంతో ఈ కేసు దర్యాప్తు ఆ తర్వాత నెమ్మదించగా.. తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ కేసు విచారణ, దర్యాప్తు తీరును తెలుసుకునేందుకు శనివారం కడప ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ను వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిశారు. వైఎస్ వివేకా హత్య కేసు తాజా పరిణామాల గురించి ఆరా తీశారు. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. దర్యాప్తు ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఎక్కడివరకు వచ్చింది? అనే విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కడప ఎస్పీగా సిద్దార్థ కౌశర్ బాధ్యతలు చేపట్టారు. దీంతో తొలిసారి మర్యాదపూర్వకంగా ఆయనను సునీత దంపతులు కలిశారు. ఈ సందర్భంగా వివేకా కేసు పూర్వాపరాల గురించి సిద్దార్థ కౌశల్‌కు ఇరువురు వివరించారు.
ప్రస్తుతం వివేకా హత్య కేసుపై హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. దీంతో పులివెందులలోని తాజా పరిణామాలు, సునీత దంపతుల భద్రతపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి సునీత దంపతులు తీసుకెళ్లారు. దస్తగిరిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక దస్తగిరి భార్యకు ప్రాణహాని ఉందని విషయాన్ని ఎస్పీకి సునీత వివరించినట్లు తెలిసింది. వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షిగా దస్తగిరి ఉన్నాడు. అతడి వాంగ్మూలమే ఈ కేసులో కీలకంగా మారింది. అతడి వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులోని నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది.
వివేకానందరెడ్డి దగ్గర డ్రైవర్‌గా దస్తగిరి పనిచేశాడు. ఈ హత్యలో అతడు కూడా కీలకంగా వ్యవహరించాడు. దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే వివేకా హత్య కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న దస్తగిరికి బెయిల్ ఇవ్వడాన్ని అవినాష్ రెడ్డి వ్యతిరేకించారు. దీంతో అతడి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో సీబీఐ కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని కోరగా.. పిటిషన్ తిరస్కరణకు గురైంది