Andhra YSRCP : ‘ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైసీపీ ని అధికారంలోకి రాకుండా చేయాలి. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ని ఓడించడమే నా లక్ష్యం.. ’ అvfటూ వైఎస్ సునీత ప్రకటించారు. మంగళవారం నాడు సునీత కడపలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలుసునని, ప్రజలు చాలా తెలివైన వారని, ప్రతిసారీ మోసపోరని అన్నారు. నిజమేంటో ప్రజలకు బాగా తెలుసునని, ప్రతిసారి ఎవరూ అందరినీ మోసం చేయలేరని అన్నారు. ఏం జరిగిందో కడప ప్రజలకు అంతా తెలుసునని, అన్న సీఎం జగన్ కడప ప్రజల్లో మనిషే కదా?.. ఆయనకు అంత భయమెందుకని ప్రశ్నించారు. వారు ఎందుకు భయపడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
ఎక్కడైనా చర్చకు సిద్ధం
తాను ఎక్కడైనా చర్చకు సిద్ధమని.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని వైఎస్ సునీత స్పష్టం చేశారు. ఎక్కడ చెబితే అక్కడ చర్చకు సిద్ధమన్నారు. సీఎం జగన్‌కు చెందిన చానల్‌లో రమ్మన్నా చర్చకు వస్తానని సునీత స్పష్టం చేశారు. తాను, వైఎస్ షర్మిల ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నామంటున్నారని.. తన తండ్రి హత్య జరిగాక తనతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని వైఎస్ జగన్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. గతంలో వారిని గుడ్డిగా నమ్మి చెప్పినట్లు చేయాల్సి వచ్చిందని.. వాస్తవాలేంటో ప్రజలకు తెలుసన్నారు. ప్రతిసారి అందరినీ మోసం చేయలేరని గుర్తుపెట్టుకోవాలని..అన్నగా తనకు సమాధానం చెప్పలేకపోయినా ఫర్వాలేదు.. సీఎంగానైనా చెప్పాలన్నారు సునీతా రెడ్డి. వైఎస్సార్‌సీపీ పునాదులు రక్తంతో తడిసిపోయాయని.. ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీ నుంచి బయటకు రావాలన్నారు. లేకపోతే ఆ పాపం చుట్టుకుంటుందని.. అందరూ ధైర్యాన్ని ఓటు ద్వారా చూపిద్దామన్నారు. తన అన్న పార్టీకి ఓటు వేయొద్దు, జగనన్న పార్టీని ఎన్నికల్లో గెలవనీయకూడదన్నారు. తన తండ్రిని హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడాలన్నారు సునీత. వివేకానందరెడ్డికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని.. వైఎస్సార్‌సీపీకి ఓటు వేయొద్దని, వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వాన్ని దించాలని పిలుపునిచ్చారు. తండ్రిపోయిన బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు, చంపినవాళ్లు, చంపించినవాళ్లు, వాళ్లను కాపాడుతున్నవాళ్లు మరోవైపు ఉన్నారన్నారు.
షర్మిల ఎంపీగా పోటీ చేయాలనేది వివేకా కోరిక
ఎంపీగా పోటీ చేయాలని వివేకా శాయశక్తులా కృషి చేశారని, ఆ ప్రయత్నంలోనే హత్యకు గురయ్యారని వైఎస్ సునీత అన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎంపీగా పోటీ చేస్తారని.. తన తండ్రి కూడా అదే కోరుకున్నారన్నారు. షర్మిల పోటీ చేయడం అభినందించదగ్గ విషయమని, వైసీపీ కోసం షర్మిల ఎంతో కష్టపడిందని, జగన్ జైలు నుంచి బయటకు వచ్చాక షర్మిలకు భయపడి ఆమెను దూరం పెట్టారన్నారన్నారు. షర్మిలకు రాజకీయ సపోర్ట్ లేకుండా ఉండేందుకే వివేకాను హత్య చేశారా? లేక ఇంకేమైనా కారణాలున్నాయా? .. వాస్తవాలన్నీ బయటకు రావాలని సునీత అన్నారు. జగనన్న జైలుకు వెళ్లిన సమయంలో షర్మిల పాదయాత్ర చేశారని.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించిన విషయాన్ని సునీత గుర్తు చేశారు. కష్టపడి పనిచేసి గెలిపించిన షర్మిలను చూసి జగన్ భయపడ్డారన్నారు. తనకంటే షర్మిలకు మంచి పేరు వస్తుందని జగన్ భయపడ్డారన్నారు.
వివేకం సినిమాను ధైర్యంగా తీశారు !
‘వివేకం’ సినిమా ఎవరు తీశారో తనకు తెలియదని, చాలా ధైర్యంగా తీశారని వైఎస్ సునీత అన్నారు. సినిమాలో చూపించిన దానికంటే ఇంకా ఘోరంగా తన తండ్రిని హత్య చేశారన్నారు. హత్యా రాజకీయాలకు చోటు ఉండకూడదని, ఈ ప్రభుత్వం మళ్లీ వస్తే రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే తాను ముందుకు వచ్చానని సునీత స్పష్టం చేశారు.