YS Sharmila Reaction On Attack On YSR Statue: ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న హింసపై ఏపీ పీసీసీ చీఫ్ (AP PCC Chief) వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం అన్నారు. రాష్ట్రంలో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలపై (Attacks On YSR Statues) అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే అన్నారు. 


రాష్ట్రంలో వైఎస్సార్ విగ్రహాలపై దాడి పిరికి పందల చర్యగా వైఎస్ షర్మిల అభివర్ణించారు. తెలుగువారి గుండెల్లో గూడుకట్టుకున్న నాయకుడు, విశేష ప్రజాదరణ పొందిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో వైఎస్సార్ చెరపలేని ఒక జ్ఞాపకమని చెప్పారు. అటువంటి మహానేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదని, గెలుపు ఓటములు ఆపాదించడం తగదని హితవు పలికారు. వైఎస్సార్‌ను అవమాయించేలా దాడులు చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. 


కొనసాగుతున్న దాడులు
ఏపీలో శిలాఫ­లకాలు, సచివాలయాల బోర్డుల ధ్వంసం కొనసాగుతోంది. పలు చోట్ల వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలపై దాడులు జరిగాయి. చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్‌ హైస్కూల్‌లో నాడు–నేడు పథకం శిలాఫలకాన్ని కొందరు ధ్వంసం చేశారు. రణరంగచౌక్‌లో ఉన్న వైఎస్సార్‌ విగ్రహంపై రాళ్లతో దాడి చేశారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డి మండలంలోని కంభంపల్లె సచివాలయ పరిధిలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రాల శిలాఫలకాలను, వెల్‌నెస్‌ సెంటర్‌ బోర్డును ధ్వంసం చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గం సంకురాత్రిపాడు గ్రామంలో సచివాలయం భవనంపైకి ఎక్కి.. బోర్డులు, శిలాఫలకాలను ధ్వంసం చేశారు. నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామం ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌ విగ్రహం తల, చేతులను విరగ్గొట్టారు. తుళ్లూరు తులసీ థియేటర్‌ వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహం తల పగలగొట్టి కాలువలో పడవేశారు.