Sharmila criticizes Chandrababu Naidu population formula: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  చేపట్టిన మన్రేగా  పరిరక్షణ యాత్ర ఏలూరు జిల్లా భీమడోలుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన కొత్త పాపులేషన్ పాలసీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  

Continues below advertisement

 ముగ్గురు బిడ్డల పాలసీపై షర్మిల ఆగ్రహం 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ముగ్గురు బిడ్డల జనాభా విధానంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో ఉన్న బిడ్డలకే చదువు, ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు కొత్తగా ముగ్గురు బిడ్డలను కనాలనడం హాస్యాస్పదం అని ఆమె విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చే  25,000 బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమేనని, అసలు రాష్ట్రంలో ఆ బిడ్డలను పెంచే ఆర్థిక స్తోమత ఉందా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలకే దిక్కులేదని, నిరుద్యోగులకు ఉద్యోగాల్లేక రోడ్లపాలవుతుంటే ఇటువంటి వింత పోకడలు అవసరమా అని  ప్రశ్నించారు. 

Continues below advertisement

అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ 

గత ఐదేళ్ల జగన్ పాలన, ప్రస్తుత చంద్రబాబు పాలన కలిసి రాష్ట్రాన్ని రూ.12 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేశాయని షర్మిల ఆరోపించారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని దయనీయ స్థితిలో ఏపీ ఉందన్నారు. ఆరోగ్యశ్రీకి  రూ. 3,000 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.6,000 కోట్ల బకాయిలు పెట్టి, ప్రజలపై రూ.15,000 కోట్ల విద్యుత్ భారాలు మోపుతూ.. జనాభా పెంచమని చెప్పడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకుంటూ ప్రజలకు సుద్దులు చెప్పడం మానుకోవాలని ఆమె హితవు పలికారు.

ఉపాధి హామీ పథకం నిర్వీర్యం 

కాంగ్రెస్ హయాంలో పేదలకు ఆసరాగా నిలిచిన  MGNREGA  పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 'VB G-RAM G' చట్టం పేరుతో పూర్తిగా నీరుగార్చిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇది గ్రామ స్వరాజ్యాన్ని వినాశనం చేసే అక్రమ చట్టమని, పనిని కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టి పేదలను బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు. 100 రోజుల పని కల్పించడమే గగనమైన వేళ, 125 రోజులు ఇస్తామన్నది పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. కొత్త చట్టం వల్ల రాష్ట్రంపై అదనంగా  రూ. 5,000 కోట్ల భారం పడుతుందని, అయినా చంద్రబాబు దీనికి మద్దతు తెలపడం దారుణమన్నారు. 

 వైఎస్ఆర్ పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యం 

జగన్ మోదీకి వంగి వంగి దండాలు పెడుతూ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, చంద్రబాబు సైతం కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడం లేదని ఆమె విమర్శించారు. రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో పయనాలన్నా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని షర్మిల స్పష్టం చేశారు. పేదల హక్కుల కోసం, ఉపాధి హామీ పరిరక్షణ కోసం తమ పోరాటం ఆగదని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు.