Telangana News: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక కీలకమైన అధ్యాయం అవిష్కృతంకానుంది. దశాబ్దాల కాలంగా సాయుధ పోరాట బాటలో సాగిన మావోయిస్టులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమయ్యారు. ఒకేసారి 126 మంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోవాలని నిర్ణయించుకోవడం రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి సమక్షంలో ఇదంతా జరగనుంది.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టులు ఒకేసారి లొంగిపోవడం ఇదే తొలిసారి. అందిన సమాచారం ప్రకారం మొత్తం 126 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను వీడి, హింసా మార్గాన్ని వదిలి సాధారణ పౌరులుగా జీవించేందుకు ముందుకు వచ్చారు. వీరంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అధికారికంగా సరెండర్ కానున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ లొంగుబాటులో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, దేవ్‌జీ చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ కాబోతుండటం మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ విభాగం అత్యంత కీలకమైన సాయుధ విభాగంగా పరిగణిస్తుంటారు. అటువంటి విభాగంలోకి ఒక పూర్తి కమిటీ జన జీవన స్రవంతిలోకి రావడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. అయితే, మావోయిస్టు పార్టీ సుప్రీంకమాండర్ గణపతి ఈ లొంగిపోయిన వారిలో లేరని ప్రాథమిక సమాచారం.
ఈ భారీ లొంగుబాటుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బంజారా హిల్స్‌లోని అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదికకానుంది. సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మీడియాతో మాట్లాడనున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు, వారికి ప్రభుత్వం తరఫున అందే పునరావాస ప్యాకేజీలు, ఈ పరిణామం వెనుక ఉన్న కీలక అంశాలను సీఎం వివరించే అవకాశం ఉంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం తక్షణ సహాయంతో పాటు, వారు సమాజంలో గౌరవప్రదంగా బతకడానికి అవసరమయ్యే ఉపాధి, ఇతర వసతులను కల్పిస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా, హింసను వీడి వచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని బలమైన సందేశాన్ని పంపాలని భావిస్తున్నారు.
ఈ లొంగుబాటులో ఎవరెవరు ఉన్నారు, ఏ స్థాయి నేతలు లొంగిపోనున్నారు ఏ ప్రాంతాలకు చెందిన వారు ఇందులో ఉన్నారనే పూర్తి వివరాలు సాయంత్రం నాలుగు గంటలకు వెల్లడికానున్నాయి.
