Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం జగన్ ఎందుకు ఉద్యమం చేయలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై తీర్మానం చేసి జగన్ చేతులు దులిపేసుకున్నారని, గంగవరం పోర్టును అదానీకి అప్పగించారని విమర్శించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరుతో విశాఖలో ఏపీ కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో షర్మిల మాట్లాడుతూ.. విశాఖ స్లీట్ ప్లాంట్‌పై కుట్రలు పన్నుతున్నారని, క్రమంగా స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్లోకి తీసుకెళ్లారని ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్‌లో పనిచేసే 30 వేల మంది కార్మికులు ఏం కావాలి? అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి అధికార, ప్రతిపక్ష నేతలు మాట్లాడరా? అని ప్రశ్నించారు.


'మన రాష్ట్రాన్ని పరిపాలించేది బీజేపీనే. హోదా., పోలవరం, రాజధాని గురించి  ఎవరు అడగరు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతున్నా ఏమీ పట్టించుకోరు. రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని బీజేపీతో పొత్తు ఎందుకు? బీజేపీతో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ఏపీకి ఏదైనా ఇచ్చిందా? సిద్దం సభలకు జగన్ రూ.600 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు జగన్ సిద్దమయ్యారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు జగన్ సిద్దమయ్యారు. ఒక ఊరి అభ్యర్థులను మరో ఊరికి మార్చడం ఎప్పుడూ చూడలేదు. అభ్యర్థులను బదిలీ చేయడం వైసీపీలోనే చూస్తున్నాం' అని షర్మిల తెలిపారు.


సంపూర్ణ మద్యనిషేధం అని జగన్ అన్నారని, ఇది ఎక్కడైనా జరిగిందా? అని షర్మిల ప్రశ్నించారు. మన రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని,  పదేళ్లుగా రాష్ట్రాన్ని ఏ నాయకుడూ పట్టించుకోలేదని అన్నారు. ఏపీకి పదేళ్లపాటు హోదా ఇస్తమని మోదీ మోసం చేశారని,  ప్రత్యేక హోదా డిమాండ్‌తో గతంలో జగన్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా గురించి మోదీని ఏనాడైనా జగన్ గట్టిగా ఏనాడైనా అడిగారా? అని షర్మిల ప్రశ్నించారు. చిన్నాన్నను చంపినవారిని రక్షించాలని అడిగేందుకే ఢిల్లీ వెళ్తున్నారని, ప్రత్యేక హోదా రావాలంటే ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదాపై చేస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారని, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఒప్పుకోదని షర్మిల వ్యాఖ్యానించారు.


'మా ప్రాణాలు అడ్డువేసైనా సరే స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటాం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రియల్ ఎస్టేట్‌గా మార్చాలని చూస్తున్నారు. విశాఖ ఉక్కు కోసం ఎంతోమంది ఉద్యమించారు. విశాఖ ఉక్కు కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారు. విశాఖ ఉక్కును దాచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు. నష్టాలు ఉన్నాయని చెబుతూ దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిద్దం అంటూ జగన్ బయలుదేరారు. అసలు సిద్దం దేనికి? ఏపీకి రాజధాని అంటే చెప్పలేని పరిస్థితి. పదేళ్లు గడుస్తున్నా పోలవరం పూర్తి కాలేదు. విశాఖ ఉక్కును ఒక్క ఇంచు కూడా కదిలించలేరు' అని షర్మిల తెలిపారు. కాగా షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ విభజన హామీలపై పోరాడుతున్నారు.