YS Sharmila : వైఎస్ వివేకానందరెడ్డి ఆస్తి కోసం జరగలేదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. తన చిన్నాన్న వివేకా పేరుపై ఎలాంటి ఆస్తులు లేవన్నారు. ఆయనకు ఉన్న అరకొర ఆస్తులన్నీ కుమార్తె సునీత పేరుపై ఎప్పుడో రాశారని స్పష్టం చేశారు. ఆస్తి కోసమే హత్య చేయాలనుకుంటే.. ఆస్తులన్నీ సునీత పేరు మీద ఉన్నాయి కాబట్టి అల్లుడు రాజశేఖర్ రెడ్డి సునీతను హత్య చేయాలన్నారు. అదే సమయంలో వైఎస్ వివేకా వ్యక్తిగత జీవితంపై నిందలు వేస్తూ ఆయనో ఉమనైజర్ అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. చిన్నాన్న వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఆయన సాధారణ జీవితం గడిపారన్నారు. కొన్ని మీడియా సంస్థలు ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చనిపోయిన వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం దారుణమని వీటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు. వివేకానందరెడ్డి ప్రజల మనిషి అని.. ఆయనేంటో కడప జిల్లా ప్రజలకు తెలుసన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం ఉందని ఆయన ఆస్తులను రెండో భార్య షమీర్, వారి బిడ్డ షెహన్ షా పేరు మీద రాస్తారన్న కారణంగానే హత్య జరిగిందని వైఎస్ అవినాష్ రెడ్డి తరపున వాదనలు వినిపిస్తున్నారు. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డికి పలు వివాహేతర బంధాలు ఉన్నాయని కూడా ఆరోపిస్తున్నారు. వీటి వల్లనే హత్య జరిగింది కానీ తమకేమీ సంబంధం లేదని అంటున్నారు. అయితే చనపిోయిన వివేకానందరెడ్డి వ్యక్తిగత జీవితంపై ఆయన క్యారెక్టర్ ను కించపరిచేలా చనిపోయిన తర్వాత ఆరోపణలు చేయడం సంచలనం అయింది. కొన్ని మీడియాల్లోనూ ఆయన వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక కథనాలు రాయడంపై షర్మిల మండిపడ్డారు. చనిపోయిన వ్యక్తి గురించి చెత్త రాతలు రాస్తే అతను సంజాయిషీ ఇచ్చుకొలేడు అన్న కనీస విలువలు కూడా లేవా అని ప్రశ్నించారు.
గతంలో వివేకానందరెడ్డి మంచి వారు, సౌమ్యుడని ఎవరికీ హానీ తలపెట్టరని అవినాష్ రెడ్డి ఆయన విగ్రహం ఆవిష్కరించినప్పుడు ప్రసంగించారు. ఇప్పుడు ఆయనే.. వివేకానందరెడ్డిపై రకరకాల ఆరోపణలు చేస్తూండటం చర్చనీయాంశమయింది. ఈ అంశంపై మొదటి నుంచి వైఎస్ సునీత వైపు ఉన్న షర్మిల బయట పెద్దగా వ్యాఖ్యలు చేయడం లేదు. అయితే చిన్నాన్న వివేకానందరెడ్డి వ్యక్తిత్వంపై ఆరోపణలు చేయడంతో ఆమె స్పందించినట్లుగా తెలుస్తోంది. షర్మిల స్పందన హాట్ టాపిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
వివేకా నందరెడ్డి హత్య విషయంలో గతంలోనే సీబీఐ వైఎస్ షర్మిల స్టేట్ మెంట్ కూడా రికార్డు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఆమె ఏమి స్టేట్ మెంట్ ఇచ్చారో తెలియదు కానీ.. ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ఆస్తులు, వివాహేతర సంబంధాలు కారణం అంటూ కొంత మంది చేస్తున్న ఆరోపణలను మాత్రం నిర్మోహమాటంగా ఖండించారు. ఈ విషయాలను ప్రచారం చేస్తున్న మీడియాపైనా ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.