YS Jagan Charges on Nara Lokesh:   కూటమి ప్రభుత్వం చేపట్టిన  మెగా డీఎస్సీ-2025  నిరుద్యోగులను, నిజాయితీపరులైన అభ్యర్థులను ఘోరంగా దగా చేసిన అతిపెద్ద కుంభకోణమని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి  ఆరోపించారు.  తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ స్కామ్‌కు సంబంధించిన నివ్వెరపోయే వాస్తవాలు, పక్కా సాక్ష్యాలను తవ్వేకొద్దీ బయటపడుతున్నాయని, అందుకే ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ, జర్నలిస్టుల నోళ్లు నొక్కుతూ, సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం రక్తాశ్రితమైన ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు.

Continues below advertisement

ఈ డీఎస్సీ స్కామ్‌కు మూలకారణం పారదర్శకతకు పాతిపెట్టడమేనని జగన్ విమర్శించారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలన్నింటినీ ఒకే ఒక్క వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారని నిలదీశారు. ఎస్సీఈఆర్టీ  లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా చేసిన వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందో, ఆ తర్వాత అతని ఐడీని బ్లాక్ చేసి మెరిట్ లిస్టులను ఎందుకు మార్చారో ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందన్నారు. కనీసం టెట్  అర్హత లేనివారికి, ఒక కేటగిరీ మార్కులను మరో పోస్టుకు వర్తింపజేసి, చివరికి రూల్ ఆఫ్ రిజర్వేషన్లకు పాతరేసి మరీ దొంగచాటుగా ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు.

స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగిన అక్రమాలు ఈ స్కామ్‌లో మరీ దారుణమని జగన్ సంచలన ఆధారాలు బయటపెట్టారు. గతంలో ఉన్న 2% స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచి, పరీక్షలు కూడా లేకుండా నేరుగా ఉద్యోగాలు ఇచ్చేలా జీవో 4, 47లను తీసుకొచ్చి, పని పూర్తయ్యాక జీవో 23, 56లతో గేట్లు మూసేశారని ఆరోపించారు. ఖమ్మంలో జరగని  సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్‌షిప్-2013 పోటీలలో పాల్గొన్నట్లు ఏపీ జూడో అసోసియేషన్ ఇచ్చిన తప్పుడు సర్టిఫికెట్లతో ఏకంగా 39 మందికి పరీక్షలు లేకుండా టీచర్ పోస్టులు ఇచ్చారన్నారు. అసలు ఆ తేదీల్లో పోటీలే జరగలేదని తెలంగాణ, ఖమ్మం జూడో అసోసియేషన్లు రాతపూర్వకంగా స్పష్టం చేశాయని, ఆశ్చర్యకరంగా ఏపీ జూడో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నది లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్ అని జగన్ ఎత్తిచూపారు.

Continues below advertisement

అలాగే టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ద్వారా 38 మందికి, జరగని నేషనల్ ఖో-ఖో పోటీల పేరుతో మరికొందరికి పరీక్షలు లేకుండానే పోస్టులు కట్టబెట్టారని జగన్ ఆరోపించారు. విశాఖపట్నంలో  యోగేశ్వర్‌రావు  అనే అభ్యర్థికి, అతని చెల్లెలికి ఖో-ఖో బోగస్ సర్టిఫికెట్లతో ఎస్‌జీటీ పోస్టులు ఇచ్చారని, తెలంగాణ ఖో-ఖో అసోసియేషన్ రిలీజ్ చేసిన విజేతల జాబితాలో వీరి పేర్లే లేవని నిరూపించారు. కర్నూలు జిల్లాలో  ఈడిగ ప్రభాకర్ అనే అభ్యర్థికి కనీస అర్హత మార్కులు రాకపోయినా, స్కూల్ అసిస్టెంట్ మార్కులను చూపిస్తూ ఎస్‌జీటీ పోస్టు కట్టబెట్టిన తీరును డీఈవో కూడా ఒప్పుకున్నారని గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తప్పుచేశారు కాబట్టే వారి కింద పనిచేసే అధికారుల విచారణతో బాధితులకు న్యాయం జరగదని జగన్ స్పష్టం చేశారు. అక్రమాలు బయటపడినా ఆడియో, వీడియో సాక్ష్యాధారాలు ఉన్నా కేసులను వీకర్ సెక్షన్ల కింద నమోదు చేసి, స్టేషనల్ బెయిళ్లతో మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఈ మెగా డీఎస్సీ కుంభకోణంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, నిజాయితీగా కష్టపడిన నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైఎస్‌ఆర్‌సీపీ కోర్టుల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ పోరాడుతుందని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.