Chandrayaan 3 Landing: చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి నేలపైన సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతం అయింది. 40 రోజులుగా ఎదురు చూస్తున్న కోట్లాది కళ్లు ఆ ఘట్టాన్ని చూసి ఆనందంతో సంబరపడిపోయాయి. సాఫ్ట్ ల్యాండింగ్ అయిన క్షణంలో ఒక్కసారిగా శాస్త్రవేత్తల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ప్రయోగం విజయవంతం కావడంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్ష నేతలు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎం ఏమన్నారంటే ?
'సేఫ్ లాండింగ్' అనే చివరి ఘట్టాన్ని కూడా పూర్తిచేయడం ద్వారా చంద్రయాన్3 ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించిందని సీఎం చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. చంద్రుని దక్షిణ ధృవం మీదకు ల్యాండర్ మాడ్యూల్ ను చేర్చిన మొట్టమొదటి దేశంగా, ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత దేశం సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని, అరుదైన చరిత్రను సృష్టించిందన్నారు.
చిరకాల ఆకాంక్ష నెరవేరిన సందర్భంలో యావత్ భారతదేశ ప్రజలకు ఇది పండుగ రోజని సీఎం అన్నారు. ఇది ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ సందర్భం అన్నారు. ఈ సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలకు, సిబ్బందికి, ఈ ప్రయోగం విజయవంతం కావడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కేసీఆర్ అభినందనలు తెలిపారు.
భారత్‌కు అపురూపమైన విజయం: సీఎం జగన్
చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇది భారత్‌కు అపురూపమైన విజయం అన్నారు. చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు, దేశంలోని ప్రతి పౌరుడు గర్వంగా ఫీలవుతున్నారని అన్నారు. ఇస్రో బృందానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ అపురూపమైన ఫీట్‌ని శ్రీహరికోట నుంచే సాధించామని, ఇది ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. భారత దేశ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో రాయదగిన రోజు అన్నారు. ఈ ప్రయోగం భారత దేశ సామర్థ్యాన్ని, మన దేశ శాష్త్రవేత్తల మేధో శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ప్రతి శాష్త్రవేత్తకు అభినందలు తెలిపారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు అభినందనలు
చంద్రయాన్ విజయవంతంపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. చంద్రుని దక్షిణ ధృవంపై చంద్రయాన్ దిగడం గొప్ప విజయం అన్నారు. ఈ ప్రయోగం భారతదేశం శాస్త్రీయ నైపుణ్యానికి నిదర్శనమన్నారు. ఈ విజయానికి హద్దులు లేవన్నారు. ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు.
చంద్రుడిపై తిరిగే రోజు ఎంతో దూరంలో లేదు
సైకిళ్లపై ఉపగ్రహ భాగాలను మోసుకెళ్లడం నుంచి చంద్రయాన్ చంద్రుడిపై ల్యాండ్ అయ్యే వరకు ఎంతో ప్రయాణం ఉందని కమల హాసన్ అన్నారు. ఇస్రో బృందం దేశానికి గర్వకారణం అన్నారు. చంద్రయాన్ విజయవంతం చరిత్రలో నిలిచిపోయే రోజు అన్నారు. భారతీయులు చంద్రుడిపై నడిచే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.
The Journey of Chandrayaan 3 : ఇస్రో చంద్రయాన్ 3 జర్నీ ఇక్కడ వీక్షించండి