ఆంధ్రప్రదేశ్‌ను ఇంటి నుంచి పని విధానానికి అత్యంత మెరుగైన ప్రదేశంగా చేయాలని ముఖ్యమంత్రి జగన్ సంకల్పించారు. ఆ దిశగా ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న ఆయన.. మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేయాలన్నారు. సీఎం జగన్ .. మంగళవారం చేసే సమీక్షల్లో భాగంగా ఈ రోజు...   ఐటీ శాఖ, డిజిటల్ లైబ్రరీల అంశంపై అధికారులతో సమావేశం అయ్యారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా మెట్రో నగరాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న కొన్ని వేల మంది ఏపీకి వచ్చి గ్రామాల్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందుకే... గ్రామాలకు మంచి సామర్థ్యం గల ఇంటర్నెట్‌ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే రాబోయే కాలం మొత్తం డిజిటల్ లైబ్రరీల మీద యువత అధారపడుతుందని సీఎం జగన్ అంచనా వేశారు.  


ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌తోపాటు.. గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు ఉపయోగకరంగా డిజిటల్‌ లైబ్రరీలు ఉండాలని అధికారులకు సూచించారు.  ప్రతి గ్రామ పంచాయతీలోనూ డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయాలని, తొలి విడతలో 4,530 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఆగస్టు 15నే పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఈలోగా స్థలాలు గుర్తించి హ్యాండోవర్‌ చేయాలన్నారు. అధికారులు ఈ విషయంలో ఇంకా చురుగ్గా ఉన్నారు. ఇప్పటికే ప్రణాళికలు రెడీ అయ్యాయని వివరించారు. డిజిటల్‌ లైబ్రరీల్లో కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులతోపాటు.. అన్ని రకాల పోటీల పరీక్షలకు అందుబాటులో స్టడీ మెటీరియల్‌ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ నిరంతరం ఇంటర్నెట్‌ కల్పించాలన్నారు. 


ఏపీలో ఐటీ పాలసీ.. ఇంటర్నెట్ అంశాలపై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే ఐటీ కంపెనీలకు ప్రత్యేక పాలసీ ప్రకటించారు.  రాష్ట్రంలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు.  విశాఖ, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్ సిటీలు నిర్మించాలని ప్రణాళికలు వేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఐటీ పాలసీ రూపొందించారు. ఐటీ రంగంలో అత్యుత్తమ యూనివర్సిటీని విశాఖలో తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. 


ఇప్పటికే గ్రామ సచివాలయాలు, ఆర్బీకే వంటి నిర్మాణాలను వేగంగా పూర్తి చేయిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు పదిహేనో తేదీ నుంచి డిజిటల్ లైబ్రరీలను ఫుల్ స్వింగ్‌లో నిర్మించాలని నిర్ణయించింది. స్కూళ్లలో నాడు, నేడు కింద మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. పూర్తిగా విద్యారంగం.. మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యార్థులకు మెరుగైన చదువు అందిస్తే అంతకు మించిన అభివృద్ధి ఉండదని జగన్ భావన. దాని ప్రకారం.. ప్రభుత్వం ప్రయారిటీలు నిర్ణయించుకుంది.