YS Jagan Politics: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఓవైపు ప్రతిపక్ష టీడీపీ ప్రచారంలో దూసుకెళ్తుంటే వైసీపీ చాపకింద నీరులా అభ్యర్థుల్ని ఫైనల్ చేస్తూ ప్రత్యర్థులకు షాకిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జ్ లను ప్రకటించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం మరో నాలుగు నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను ఫైనల్ చేశారు. 


జగ్గంపేటకు తోట నర్సింహం..
జగ్గంపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకి షాకిచ్చారు సీఎం జగన్. ఆ నియోజకవర్గానికి తోట నర్సింహాన్ని ఇన్ చార్జ్ గా ఖరారు చేశారు. తోట నర్సింహం గతంలో టీడీపీ ఆధ్వర్యంలో ఎంపీగా పనిచేశారు. గత ఎన్నికల ముందు ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఈ దఫా ఆయనకు న్యాయం చేయాలనుకున్నారు సీఎం జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబుని కాదని తోట నర్సింహంకు ఆ స్థానం కట్టబెడుతున్నారు. 


వంగా గీతకు అసెంబ్లీ ఛాన్స్..
కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారు. ఆమె కోరికను మన్నించి పిఠాపురం అసెంబ్లీ సీటు కేటాయించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ముందస్తుగా ఆమెను పిఠాపురంకు ఇన్ చార్జ్ గా ఫైనల్ చేశారు. ప్రస్తుతం పిఠాపురంలో పెండెం దొరబాబు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను కాదని ఈసారి అక్కడ వంగా గీతకు అవకాశమిస్తున్నారు సీఎం జగన్. 


రాజమండ్రి రూరల్ నుంచి చెల్లుబోయిన వేణుగోపాల్..
ఇటీవల రామచంద్రాపురం నియోజకవర్గంలో సీఎం జగన్ కి కొత్త తలనొప్పులు వచ్చాయి. వీటికి కూడా ఆయన పరిష్కారం వెదికారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ నియోజకవర్గాన్ని మార్చేస్తున్నారు. ఈసారి ఆయన్ను రాజమండ్రి రూరల్ నుంచి పోటీకి దింపాలనుకుంటున్నారు. ఆయనకు రాజమండ్రి రూరల్ ఇన్ చార్జ్ గా కొత్త బాధ్యతలు అప్పగించనున్నారు జగన్. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఈ దఫా ఆ సీటు జనసేనకు ఇచ్చే అవకాశముందనే వార్తలొస్తున్నాయి. అక్కడ టీడీపీ-జనసేనకు ధీటైన ప్రత్యర్థిగా మంత్రి చెల్లుబోయినను ఎంపిక చేశారు సీఎం జగన్. 


పిల్లి కుటుంబానికి రామచంద్రాపురం..
రామచంద్రాపురం నుంచి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను మరోచోటుకు మార్చాలన్న నిర్ణయంతో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ కి అవకాశం ఖాయమైంది. గతంలో ఇదే నియోజకవర్గం విషయమై పిల్లి సుభాష్ చంద్రబోస్, సీఎం జగన్ పై అలిగారు. కొన్నాళ్లు ఆయన ఆ నియోజకవర్గం కోసం పట్టుబట్టారు. వాస్తవానికి పిల్లి సుభాష్ ది రామచంద్రాపురం నియోజకవర్గమే. అయితే 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఆయన ఓడిపోవడంతో 2019లో మండపేటకు మార్చారు జగన్. రామచంద్రాపురంలో చెల్లుబోయినను నిలబెట్టి గెలిపించుకున్నారు. అనూహ్యంగా మండపేటలో కూడా పిల్లి ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి రావడంతో పిల్లిని ముందు మంత్రి వర్గంలోకి తీసుకున్నా.. తర్వాత ఆయన్ను రాజ్యసభకు పంపించారు జగన్. కానీ రామచంద్రాపురంపై ఆయనకు మమకారం అలానే ఉంది. అక్కడ తన తనయుడు సూర్యప్రకాష్ కి టికెట్ ఇప్పించుకోడానికి పట్టుబట్టారు ఎంపీ సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు మంత్రి చెల్లుబోయినను రాజమండ్రి రూరల్ కు పంపించేయడంతో రామచంద్రాపురం ఖాళీ అయింది. అక్కడ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు సూర్యప్రకాష్ ని ఇన్ చార్జ్ గా నియమించారు సీఎం జగన్.


మొత్తమ్మీద సీఎం జగన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం విపరీతమైన ప్రయోగాలు చేస్తున్నారు. ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలో దింపుతున్నారు. మరి ఎమ్మెల్యేలకు ఎంపీ అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి. ఇటీవల 11 నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను ప్రకటించిన సీఎం జగన్, కొత్తగా నలుగురిని ఇన్ చార్జ్ లుగా ఫైనల్ చేశారు. ఏ క్షణంలోనైనా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ ప్రకటనతో సిట్టింగ్ లు హర్ట్ అయినా కూడా ఆయన మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు.