Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఎస్కార్ట్‌ బెయిల్‌ను నవంబరు 1 వరకు సీబీఐ కోర్టు పొడిగించింది. ఎస్కార్ట్‌ బెయిల్‌ పొడిగించాలంటూ, సీబీఐ కోర్టులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డి పిటిషన్‌ వేశారు. కంటికి కాటరాక్ట్‌ శస్త్రచికిత్స చేయించుకున్నానని, వైద్యుల సూచన, తదుపరి చికిత్సల కోసం రెండు నెలల పాటు పొడిగించాలని పిటిషన్‌ వేశారు. విచారణ జరిపిన సీబీఐ కోర్టు నవంబరు 1 వరకు ఎస్కార్ట్‌ బెయిల్‌ పొడిగించింది. 


గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తింపు


వివేకానందా రెడ్డి హత్య కేసులో ఏప్రిల్‌లో అవినాష్​ రెడ్డి తండ్రిని వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డే కుట్ర దారుడనే అభియోగాలు ఉన్నాయి. 2019 సంవత్సరం మార్చి 15న వివేకా హత్య జరిగినప్పుడు తొలుత వివేకగా గుండేపోటుతో మరణించారనే ప్రచారంలో భాస్కర్ రెడ్డే కీలక సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రచారం చేయటంతో పాటు సాక్ష్యాలను చెరిపేయడంలో భాస్కర్ రెడ్డి కీలకపాత్ర పోషించాలరిన సీబీఐ వెల్లడించింది. వివేకా హత్యకు ముందు సునీల్ యాదవ్.. భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు ఆధారాలను సేకరించినట్లు సీబీఐ పేర్కోంది. సునీల్ యాదవ్ భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించినట్లు తెలిపింది. అంతేకాకుండా దస్తగిరి కదిరికి వెళ్లి గొడ్డలి తెచ్చే వరకు భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ వేచి చూసినట్లు.. అతను ఇంట్లో ఉన్నప్పుడు భాస్కర్ రెడ్డి తన రెండు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని సీబీఐ వివరించింది.


రాజకీయ ఎదుగుదల ఉండదనే...


2019 మార్చి 14 సాయంత్రం భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి ఓడిపోవడానికి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని ప్రచారం సాగింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి తర్వాత వివేకానంద రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దేవి రెడ్డిలను తీవ్రస్థాయిలో బెదిరించినట్లు ప్రచారం జరిగింది. దీంతో వివేకానంద రెడ్డి వైసీపీలో ఉంటే, తమకు రాజకీయ ఎదుగుదల ఉండదని భాస్కర్​ రెడ్డి భావించారని సీబీఐ తెలిపింది. వివేకానంద రెడ్డి రాజకీయంగా ఎదగడాన్ని భాస్కర్​ రెడ్డి జీర్ణించుకోలేకపోయారని సీబీఐ వెల్లడించింది. దీంతో దేవిరెడ్డి శివ శంకర్​ రెడ్డితో హత్య చేయించి ఉంటారని భావిస్తున్నట్లు సీబీఐ తెలిపింది.


పథకం ప్రకారమే 


పథకం ప్రకారమే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి వివేకాను హత్య చేయించారు. నిందితులు సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరికి పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి హత్య చేయించారు. హత్యకు నెల రోజుల ముందే వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి హత్యపై చర్చించారు. షేక్ దస్తగి ఏ-4, అప్రూవర్‌గా మారి హత్యకు సంబంధించిన విషయాలన్నీ వెల్లడించాడు. దస్తగిరి వాంగ్మూలం ప్రకారం భాస్కర్‌రెడ్డి పాత్ర కీలకంగా ఉందని దర్యాప్తులో వెల్లడైంది. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి నిందితులకు 40 కోట్ల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడు. ఇదే విషయాన్ని A-1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కాల్ చేసి షేక్ దస్తగిరికి సమాచారం ఇచ్చాడు. అడ్వాన్స్‌గా సునీల్ యాదవ్ ద్వారా నగదు బదిలీ అయింది. వివేకాను 2019 మార్చి 15న A-1 ఎర్ర గంగి రెడ్డితో పాటు మరో నలుగురు దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారని సీబీఐ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.