YS Avinash Reddy : వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని తాను ఎవరికీ చెప్పలేదని వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. అప్పట్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే గుండెపోటు అంశాన్ని సృష్టించిందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. సీబీఐ విచారణకు మూడో సారి హాజైన ఆయన విచారణ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలను మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకున్నారని.. ఇలా చాలా ముఖ్యమైన అంశమన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య సమయంలో ఓ లేక దొరికిందని.. ఆ లేఖను వివేకా అల్లుడు రాజశేఖర్రెడ్డి దాచి పెట్టారన్నారు. ఆ లేఖ విషయంపై దర్యాప్తు చేయడం లేదన్నారు. సీబీఐ విచారణ దారి తప్పుతోందని ఆరోపించారు. కంచే చేను మేసినట్లుగాసీబీఐ వ్యవహరిస్తోందని... కుటుంబంలో గొడవలను పట్టించుకోవడం లేదన్నారు.
వివేకా హత్య ఆస్తుల కోసమే జరిగిందని తేల్చిన అవినాష్ రెడ్డి
ఆస్తుల పంపకంలో వైఎస్ వివేకాకు.., కుమార్తె, అల్లుడికి మధ్య గొడవలు ఉన్నాయన్నారు. ఆస్తుల కోసమే హత్య జరిగిందని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. సీబీఐ అధికారులు మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పారని మీడియాకు తెలిపారు. కట్టుకథను అడ్డు పెట్టుకుని విచారణ చేస్తున్నారని.. సీబీఐ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమన్నారు. సీబీఐ అధికారులు చెబుతున్న గూగుల్ టేకవుట్ ను టీడీపీ టేకవుట్‌గా అవినాష్ రెడ్డి అభివర్ణించారు. విచారణ విషయంలో సీబీఐ కూడా లీకులు ఇస్తోందని ఆరోపించారు. ఎనిమిది మంది సాక్షులు ఇచ్చిన సాక్ష్యాలను సీబీఐ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
నాపై ఆరోపణల వెనుక భారీ కుట్ర : అవినాష్ రెడ్డి
బెంగళూరు సెటిల్మెంట్ విషయంలో వచ్చిన సొమ్ము విషయంలో ఈ హత్య జరిగిందన్నదని నిజం కాదని.. ఆస్తుల కోసమే హత్య జరిగిందని అవినాష్ రెడ్డి మీడియా ముందు స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హామీ ఇస్తున్నానని వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. తనను లక్ష్యంగా చేసుకునే విచారణ చేస్తున్నారని.. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని చెప్పుకొచ్చారు. మూడో సారి సీబీఐ విచారణకు పిలవడంతో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. దీంతో పులి వెందుల నుంచి పెద్ద ఎత్తున అవినాష్ రెడ్డి అనుచరులు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయం దగ్గర గుమికూడారు. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు దగ్గరకు వచ్చినప్పుడుపెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో రిలీఫ్ - సోమవారం వరకూ అరెస్ట్ వద్దని సీబీఐకి ఆదేశం !