వైసీపీ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఉక్కు కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆమెతో భేటీ అయ్యారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను విక్రయించే ఆలోచన విరమించుకోవాలని కేంద్రమంత్రికి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అనేక ఏళ్ళ పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాల అనంతరం 1966లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి ఆంధ్రుల చిరకాల కల నెరవేరిందని... ఈ పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని వివరించారు. 
ప్రభుత్వ రంగ సంస్థల్లో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కే ఆభరణం వంటిదని తెలిపారు వైసీపీ ఎంపీ. 35 వేల మంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌పై ఆధారపడి జీవిస్తున్నాయని.. స్టీల్‌ ప్లాంట్‌ కారణంగానే విశాఖపట్నం నగరం మహా నగరంగా విస్తరించి రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా ఉందని  వివరించారు విజయసాయిరెడ్డి.
కరోనా టైంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచే దేశంలోని అనేక ప్రాంతాలకు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సీజన్‌ను రైళ్ళ ద్వారా తరలించి లక్షల మంది ప్రాణాలు కాపాడిందని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో ఉత్పతి అయ్యే స్టీల్‌ నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు పోటీ ఇస్తుందని... అలాంటి సంస్థ కేవలం సొంతంగా గనులు లేకపోయినందునే నష్టాలు బాటలో ఉందని తెలిపారు. కేవలం ఇనుప ఖనిజాన్ని మార్కెట్‌ రేటుకు కొనుగోలు చేయడం కోసమే ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఏటా 300 కోట్ల రూపాయలను అదనంగా భరించాల్సి వస్తోందని... ఈ పరిస్థితుల దృష్ట్యా ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే అతి తక్కువ కాలంలోనే విశాఖ ఉక్కుకు లాభాలు వస్తాయన్నారు. తద్వారా ఆ లాభాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీగా డివిడెండ్లు చెల్లిస్తుందని వినతి పత్రంలో వివరించారు.


మరోవైపు ఇందు, భారత్ కంపెనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు. రాష్ట్రపతి, ప్రధానికి రాసిన లేఖలో చాలా అంశాలు ప్రస్తావించారు. 
వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టాయిని ఇందు భారత్‌ కంపెనీలపై రాష్ట్రపతి, ప్రధానికి వైసీపీ ఎంపీలు లేఖ రాశారు.  రూ.941.71 కోట్ల ప్రజాధనం స్వాహా చేశారని ఎంపీలు లేఖలో ఆరోపించారు. విద్యుత్‌ కంపెనీ పేరుతో లోన్లు తీసుకుని నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. ఎస్‌బీఐ నుంచి రూ.63.46 కోట్లు తీసుకుని ఎగ్గొట్టారని పేర్కొన్నారు. పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులను తీవ్రంగా మోసం చేశారని... తీవ్రమైన ఆర్థిక మోసానికి పాల్పడ్డ ఇందు భారత్‌ పవర్‌ లిమిటెడ్, ఇందు భారత్‌ పవర్‌ ఇన్‌ఫ్రా, ఆర్కే ఎనర్జీ డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఈ కేసులో సీబీఐ దర్యాప్తు సరిగా జరగడం లేదని... దీని వల్ల ప్రజలకు సంస్థలపై ఉన్న నమ్మకం పోయే ప్రమాదం ఉందన్నారు వైసీపీ ఎంపీలు. తక్షణమే ఇందు భారత్‌ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఈ కంపెనీ డైరెక్టర్ల విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించాలని... మోసం చేసిన మొత్తాన్ని డైరెక్టర్ల నుంచి వసూలు చేయాలన్నారు.