TDP VS YCP: ఏపీలో అధికార పార్టీ వైసీపీ, విప‌క్ష టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం ఓ రేంజిలో జ‌రుగుతున్న సంగ‌తి అందరికీ తెలిసిందే. అయితే అందరు నేతలు చాలా వరకు ఇలాగే ఉండారు. అధికారంలో ఉన్న పార్టీకి, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీకీ దాదాపుగా జాతి వైరం ఉన్నట్లుగానే వ్యవహరిస్తుంటారు. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఘటన మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఆయా పార్టీలకు సబంధించిన వాళ్లంతా విమర్శలు, ప్రతి విమర్శలతో రెచ్చిపోతుంటే.. వీరు మాత్రం హాయిగా తమకేం సంబంధం లేదన్నట్లుగా ఓ చోటు కలిశారు. వీరిద్దరు మాత్రమే కాదండోయ్.. ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా ఇందులో ఉన్నారు. అయితే ఈ ఫొటోలో ఉన్న వాళ్లెవరు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్లెవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.  


టీడీపీ ఎంపీలతో వైసీపీ ఎంపీ శ్రీకృష్ణ‌ దేవ‌రాయ‌లు..


వైసీపీ యువ నేత‌, న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌ దేవ‌రాయ‌లు మంగ‌ళ‌ వారం టీడీపీ ఎంపీల‌తో క‌లిసి క‌నిపించారు. అయితే ఇరు పార్టీల మ‌ధ్య వివాదంతో త‌న‌కేమీ సంబంధం లేద‌న్న రీతిలో ఆయన వారితో కలిసి కనిపించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అంతే కాకుండా టీడీపీతో పాటు మ‌రికొన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీల‌తో క‌లిసి ఆయ‌న నేరుగా టీడీపీ సీనియ‌ర్ నేత‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి చెందిన ఢిల్లీ నివాసానికి వెళ్లారు. అక్క‌డ టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు కేశినేని, గ‌ల్లా జ‌య‌దేవ్‌, కింజ‌రాపు రామ్ మోహ‌న్ నాయుడులతో కలిసి గ్రూప్ ఫొటోకు ఫోజిచ్చారు. అందులో ఆయన చాలా సంతోషంగా నవ్వుతూ కనిపించారు.


అంతా కలిసి ఫొటోకు ఫోజు...


అయితే ఈ ఫొటోలో కేవలం ముగ్గుటు టీడీపీ ఎంపీలే కాదండోయ్... వైసీపీ ఎంపీ లావుల‌తో పాటు డీఎంకేకు చెందిన ఎంపీలు క‌నిమొళి, త‌మిజాచ్చి తంగ‌పాండియ‌న్‌, క‌థిర్ ఆనంద్‌, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, శివ‌సేన ఎంపీ ధైర్య‌శీల్ మానే త‌దిత‌రులు కూడా ఉన్నారు. తామంతా క‌లిసి కేశినేని నాని ఇంటికి వెళ్లిన‌ట్లు పేర్కొన్న‌ డీఎంకే ఎంపీ కథిర్ ఆనంద్ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. రాజకీయాలకు అతీతంగా వీరంతా కలిసి ఒక చోట ఉండటం చూసి చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరేమో ఇది సరైన పద్ధతి కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. 


రాజకీయాల్లో చాలా సార్లు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయంటూ కొందరు చెబుతున్నారు. తమకు నచ్చినా నచ్చకపోయినా నేతలతో కలిసి ఉండాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. అయితే ఆయన తన ఇష్టంతోనే టీడీపీ నేత ఇంటికి వెళ్లారా, లేదంటే అందరూ కలిసి వెళ్దామంటే రాను అని చెప్పలేక వెళ్లారా అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఏది ఏమైనప్పటికీ.. ఇలా అంతా కలిసి ఓ చోట కనిపించడం చాలా సంతోషంగానే ఉంది.