YCP MP Balashauri met Janasena chief Pawan Kalyan : మచిలీపట్నం వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసంకు వెళ్లి పవన్ తో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే బాలశౌరి రాజీనామా చేశారు. ఇప్పటికే ఆయన జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా పవన్ తో భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు రెండు గంటలపాటు సాగింది. ఏపీలో తాజా రాజకీయాలతో పాటు పలు అంశాలపై వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, పార్టీలో ఎప్పుడు చేరేది అనే విషయంపై క్లారిటీ రాలేదు. పవన్ భేటీ ముగిసిన తరువాత బాలశౌరి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే, మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరేందుకు బాలశౌరి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
బాలశౌరి జనసేన పార్టీలో చేరితే మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారా గుంటూరు నుంచి పోటీచేస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. బాలశౌరి మాత్రం మరోసారి మచిలీపట్నం నుంచి బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కారణంగా ఏ పార్టీకి ఏ స్థానం లభిస్తుందో ఇంకా క్లారిటీ రాలేదు.. దీంతో గుంటూరు, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీకి దక్కిన స్థానం నుంచి బాలశౌరిని పవన్ బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. పవన్, బాలశౌరి భేటీలో ఈ అంశంపైనా చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే, బాలశౌరికి పవన్ కల్యాణ్ ఎలాంటి హామీ ఇచ్చారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై బాలశౌరి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. స్థానికంగా వైసీపీ నేతలు పేర్ని నాని, జోగి రమేష్ లతో చాలాకాలంగా బాలశౌరికి విబేధాలు కొనసాగుతూ వస్తున్నాయి.. ఈ విబేధాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఈ క్రమంలోనే తనకు వైసీపీ అధిష్టానం సరియైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. వైసీపీలో ఇలానే కొనసాగితే భవిష్యత్ లో రాజకీయంగా మనుగడ సాగించలేమని భావించిన బాలశౌరి ఆ పార్టీకి ఇటీవల రాజీనామా చేశారు. ఆ తరువాత జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా పవన్ తో భేటీ అయ్యారు.
సమావేశం అయిపోయిన తర్వాత బాలశౌరి మీడియాతో ముక్తసరిగా మాట్లాడారు. అన్ని విషయాలు తర్వాత చెబుతానన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్.. జనసేనలో చేరికపై త్వరలో చెబుతానన్నారు. పవన్ ను కలిసిన వారిలో బాలశౌరి కుమారుడు కూడా ఉన్నారు.