YCP MLA Kolusu Parthasaradhi : మాజీ మంత్రి, పెనమలూరు వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరనున్నారు. శుక్రవారం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్థసారధిని పెనుమలూరు నుంచి కాకుండా నూజివీడు లేదా మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ సూచించారు. అయితే సీనియర్ ని అయనను ఏ మాత్రం గౌరవించడం లేదని.. గుర్తించడం లేదన్న అసంతృప్తితో ఉన్న ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పార్థసారధి అసంతృప్తిని గుర్తించిన సీఎం జగన్ ఆయనను పిలిపించుకుని మాట్లాడారు పార్టీని వీడొద్దని, సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే పార్టీ మారిపోవాలనే ఆయన నిర్ణయించుకున్నారు.
వైసీపీ సాధికార బస్సు యాత్రలో పార్థసారథి ఇటీవల అందరిముందు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. జగన్ తనను గుర్తించకపోయినా పెనమలూరు ప్రజలు మాత్రం తనకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నారని పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఊహాగానాలకు కారణమయ్యాయి. ఆయన పార్టీని వీడబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. విజయవాడలోని తన కార్యాలయంలో మంగళవారం రాత్రి టీడీపీనేతలతో పార్థసారథి భేటీ అయ్యారు. తెదేపాకు చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం తెదేపా నేత బొమ్మసాని సుబ్బారావులు వచ్చి సారథితో చర్చించారు. సారథిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించగా ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈనెల 18న కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా అధినేత చంద్రబాబు ‘రా.. కదలి రా’ బహిరంగ సభ జరగనుంది. ఆ వేదిక మీదే పార్థసారథి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది.
పార్థసారధితో పాటు ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, రక్షణ నిధి కూడా వైసీపీపై అసంతృప్తితో ఉన్నారు. వారు కూడా పార్థసారధితో పాటు పార్టీ మారుతారా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. వారు పార్టీ మారకుండా.. సీఎంవోకు రావాల్సిందిగా పిలుపులు వెళ్లాయి. అయితే ఎమ్మెల్యే రక్షణ నిధి మాత్రం తాను వచ్చేది లేదని చెప్పినట్లుగాతెలుస్తోంది.
పార్థసారథి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఉయ్యూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్, వెటర్నరీ యూనివర్శిటీ శాఖల మంత్రిగా పని చేశారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 2009 ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. 2014లో ఓటమి పాలయిన పార్థసారథి...2019లో వైసీపీ అభ్యర్థిగా పెనమలూరు నుంచి పోటీ చేసి...టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ పై 10వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.