YSRCP Politics :  పార్టీని ధిక్కరించిన వారిని ఉపేక్షించకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. చర్యలు తీసుకోవడం లేదన్న కారణంగా  ఫిరాయింపులు ఎక్కువ అవుతూండటంతో అనర్హతా వేటు వేస్తామని అందులో సందేహం లేదని సంకేతాలు పంపాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా గతంలో పార్టీకి దూరం అయిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పిన ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్, మండలి చైర్మన్‌లకు ఫిర్యాదు చేశారు.  


ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి,   తాడికొండ ఎమ్మెల్యే స్రీదేవి గతంలో పార్టీని ధిక్కరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేశారని సజ్జల ఆరోపించారు. అప్పట్లో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. కనీ అప్పట్లో అనర్హతా వేట వేయలేదు. అప్పట్లో అనర్హతా వేటు వేస్తే ఉపఎన్నికలు వస్తాయనో.. లేకపోతే సాంకేతికంగా అనర్హతా వేటు చెల్లదన్న అనుమానం కారణంగానో లైట్ తీసుకున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆ నలుగురిపై అనర్హతా వేటు వేయలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.           


అయితే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతా వేట వేయాలంటే.. స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి.  ఆ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలపై వేటు వేయలేరన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో ఈ నలుగురిపైనే ఎందుకని.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారని చెబుతున్నారు. మరి వారిపై ఎందుకు అనర్హతా వేటు వేయరని ప్రశ్నలు వస్తాయి. అయితే ఇప్పుడు ఆ నలుగురి గురించి పక్కన పెట్టి.. వైసీపీని ధిక్కరించిన వారిపైనే అనర్హతా వేటుకు సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది.            


ఇటీవల ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించారు. శాసనసభ్యలు కోటాలో ఎన్నికయిన వంశీకృష్ణ యాదవ్ తో పాటు సి.  రామచంద్రయ్య కూడా పార్టీని వీడారు. ఒకరు జనసేనలో మరొకరు.. టీడీపీలో చేరిపోయారు. వారికి తలా మూడేళ్ల వరకూ పదవి కాలం ఉంది. వీరిపైనా అనర్హతా వేటు వేయాలని మండలి చైర్మన్ కు వైసీపీ  ఫిర్యాదు చేసింది. 


ఎమ్మెల్యేపై అనర్హతా వేటు వేసినా ..వేయకపోయినా ఒకటే. ఎందుకంటే..  మరో నెలన్నర రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కాబట్టి.. ఆ ఎమ్మెల్యేలకు పోయేదేమీ ఉండదు. అయితే ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు వేస్తే ఉపఎన్నికలు వస్తాయి. అవి కొత్త అసెంబ్లీ ఏర్పడిన తర్వాతనే వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే  వచ్చే ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి ఆ సీట్నలు భర్త చేయాల్సి ఉంటుంది.