Free bus scheme Politics In AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని స్త్రీశక్తి పేరుతో ప్రారంభించింది. పూర్తి స్థాయిలో శనివారం నుంచి మహిళలు తమ గుర్తింపు కార్డు చూపించి ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం ఈ పథకంపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకునేలా ఏర్పాట్లు చేసింది. పలువురు ప్రయాణికులు , టీడీపీ కార్యకర్తలు బస్సుల్లో మహిళలు పథకాన్ని ఎలా వినియోగించుకుంటున్నారో వీడియోలు తీసి అప్ లోడ్ చేస్తున్నారు.
అయితే వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం అత్యధిక బస్సుల్లో మహిళలకు డబ్బులు వసూలు చేస్తున్నారని.. చాలా స్వల్ప సంఖ్యలోనే బస్సులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై కొన్ని వీడియోలను వారు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తిరుమలకు టిక్కెట్ తీసుకుంటున్నారని.. తిరుమల పక్క రాష్ట్రంలో ఉందా అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఆరోపణలకు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం ఉన్న బస్సెస్ లో 85% లో ఫ్రీ అది కూడా స్టేట్ మొత్తం వర్తింప చేశారని.. కర్ణాటక, తెలంగాణ కంటే బెటర్ గా ఇస్తున్నారన్నారు. టీటీడీకి చెందిన సప్తగిరి బస్సుల్లో మాత్రం ఉచితం కాదని అవి ఆర్టీసీ కిందకు కాకుండా.. టీటీడీ కిందకు వస్తాయి కాబట్టి టెక్నికల్ సమస్యలు ఉన్నాయంటున్నారు.
ఇవే కాకుండా మరికొన్ని వీడియోలతో వైసీపీ సోషల మీడియా పథకం అమలు తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ పథకంపై సోషల్ మీడియాతో పాటు బయట కూడా.. రాజకీయం ప్రారంభమయింది.