YCP candidates will be announced by CM Jagan on Saturday : ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదల కానుంది.వైసీపీ అభ్యర్థుల జాబితాను కూడా అదే రోజు విడుదల చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఏపీ సీఎం జగన్ ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద ఈ తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే 12 లిస్టుల ద్వారా నియోజకవర్గాల ఇంఛార్జులను ప్రకటించిన సీఎం జగన్.. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తే నిర్మొహమాటంగా పక్కనపెడుతున్నారు. అనేక చోట్ల అసంతృప్త గళాలు వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు ప్రతి రోజూ సీఎం జగన్ వివిధ నియోజకవర్గాల నేతలను సీఎంవోకు పిలిపించుకుని మాట్లాడుతూనే ఉన్నారు.
ఇంఛార్జీలనే అభ్యర్థులుగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. వైఎస్ జగన్ మార్పుల కారణంగా బీఫామ్ వచ్చే వరకూ అభ్యర్థిత్వంపై క్లారిటీక లేదు. అభ్యర్థుల ప్రకటనలో 2019 విధానాన్నే అనుసరిస్తున్నారు. మార్చి 16వ తేదీన వైసీపీ ఫైనల్ జాబితా రిలీజ్ చేస్తారని తెలిసింది. మార్చి 16వ తేదీన వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయను సందర్శించనున్నారు. అక్కడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద వైసీపీ తరుఫున అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జగన్ ప్రకటించనున్నారు. అయితే 2019 శాసనసభ ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే వైఎస్ జగన్ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఈ సారి కూడా అదే సెంటిమెంట్ ఫాలోకానున్నారు.
అభ్యర్థుల ప్రకటన తర్వాత ఉత్తరాంధ్ర నుంచి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ప్రచార రూట్ మ్యాప్ సిద్ధమైంది. ఈ నెల 18న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు జగన్. అదే రోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం జగన్. ఇలా 2 లేక 3 బహిరంగ సభలు లేదా రోడ్ షోలు ఉండేలా షెడ్యూల్ రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 77 అసెంబ్లీ 23 పార్లమెంట్ ఇంచార్జి లను మార్చిన సీఎం జగన్… ఈ పర్యటనల లోనే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు.
తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించింది. మరో పదహారు స్థానాలకు రేపోమాపో అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. బీజేపీకి కేటాయించిన స్థానాలపై ఆ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. షెడ్యూల్ విడుదలవగానే.. ఢిల్లీలో ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తుంది. పన్ కల్యాణ్ కూడా ఇప్పటికే పార్టీ నేతలకు.. అభ్యర్థులపై స్పష్టత ఇచ్చారు.