Gannavaram YSRCP : వైఎస్ఆర్‌సీపీలో గన్నవరం సీటు వివాదం అంతకంతకూ ముదురుతోంది. తాను జగన్ తోనే వైసీపీలోనే ఉన్నానని గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. వైసీపీ నుంచే సీటు ఇస్తారని ఆశిస్తున్నానని.. అమెరికా నుంచి తీసుకు వచ్చి జగన్ నన్ను క్రాస్ రోడ్డులో నిల్చో పెడతారని నేను అనుకోవటం లేదని వివరించారు. జగన్, వైసీపీ అధిష్టానం నాకు అన్యాయం చేస్తారని అనుకోవటం లేదని.. గత ఎన్నికల్లో నేనే ఇక్కడ నుంచి పోటీ చేశానని గుర్తు చే శారు. గన్నవరం వేరే సీటు వారికి ఇచ్చామని ఇంకా ప్రకటన చేయలేదు కదా అని యార్లగడ్డ ప్రశ్నిస్తున్నారు. వల్లభనేని వంశీకే అక్కడ వైసీపీ టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతూండటంపై ఆయన స్పందించారు.
జగన్ న్యాయం చేస్తారని యార్లగడ్డ వెంకట్రావు ఆశ
తాను టీడీపీలో నేను జాయిన్ అవుతా అనేది సోషల్ మీడియా ప్రచారం మాత్రమేనని యార్లగడ్డ వెంకట్రావు అంటున్నారు. పెనమలూరు సీటు ఇస్తా అని జగన్ అంటే నేను ఇండియా వచ్చాను…తర్వాత గన్నవరం సీటు నుంచి జగన్ పోటీ చేయమని చెబితే అక్కడ నుంచి పోటీ చేసానని వివరించారు. గన్నవరం లో వైసీపీని పటిష్టం చేశానని.. రిగ్గింగ్, దొంగ ఇళ్ళ పట్టాల కారణంగా ఓటమి పాలయ్యాని చెప్పారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు. నేను గెలిచి ఉంటే నియోజక వర్గానికి ఈ ఖర్మ ఉండేది కాదని.. కొన్ని కారణాలతో గన్నవరంలో రాజకీయాలకు దూరంగా ఉన్నా తప్ప నియోజక వర్గానికి కాదన్నారు. జగన్ నాకు గన్నవరం అనే పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని తెలిపారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు.
వంశీకే సీటిస్తామని గతంలో హామీ ఇచ్చిన జగన్
అయితే గన్నవరం నియోజకవర్గం సీటు తనదేనని శాసన సభ్యుడు వల్లభనేని వంశీ చెబుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ తనకు స్వయంగా హామీ ఇచ్చారని చెబుతున్నారు. స్దానిక నాయకత్వం పార్టీ కి వ్యతిరేకంగా కార్యకలాపాలను నిర్వహించటం సమంజసం కాదని వంశీ గతంలో బహిరంగంగా వ్యాఖ్యానించారు. అయితే తెలుగు దేశం పార్టి టిక్కెట్ పై గెలిచిన వంశీ, ఎన్నికల తరువాత పార్టీ మారి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిలో చేరటం తో వివాదానికి కారణం అయ్యింది. వంశీకి సీటు ఇస్తే ఎట్టి పరిస్దితుల్లో తాము సహకరించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు.
పలు నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్యలతో వైసీపీ నాయకత్వం సతమతం
ఎన్నికల సమయంలో పార్టీల్లో నేతల మద్య విభేదాలు బయట పడట కామన్ గా జరుగుతుంటాయి. అయితే అధికార పార్టీలో గ్రూపుల గోల ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అటు మంత్రి జయరాం నియోజకవర్గంలో కూడ అదే సీన్ కనిపిస్తోంది. కపట్రాళ్ల బొజ్జమ్మ మంత్రి నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండటం పార్టీలో చర్చకు దారితీసింది. ఇటీవలే కపట్రాళ్ళ ఫ్యామిలీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇలా వరుసగా వివాదాలు నెలకొంటున్న నేపద్యంలో పార్టీలో పరిస్దితులు పై అధి నాయకత్వం ప్రత్యేకంగా శ్రద్ద పెట్టింది.