Sunkara PadmaSri On Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వివాదాలు ప్రారంభమయ్యాయి.  విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ షర్మిలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు.  షర్మిల కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించిందని వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ  మండిపడ్డారు. రాహుల్ గాంధీకి విలువ ఇచ్చి షర్మిలను ఏమీ అనకుండా వదిలేశామన్నారు.  కక్షపూరిత చర్యల కోసమే షర్మిల ఏపీకి వచ్చిందా అని పద్మశ్రీ ప్రశ్నించారు.      


షర్మిల పార్టీ ఫండ్ దాచుకున్నారన్న  సుంకర పద్మశ్రీ                                      


పార్టీ ఇచ్చిన ఫండ్ దాచుకుని షర్మిల అభ్యర్ధుల్ని గాలికి వదిలేసింది. షర్మిల క్యాడర్‌ను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యానని. పీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన షర్మిల నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  పార్టీ అభ్యర్థులకు కనీసం జెండాలు కూడా అందించలేదు. రాహుల్ గాంధీ ధైర్యంగా మోదీకి ఎదురుగా నిలబడ్డారని  అన్నారు.                   


సీనియర్ నేతల్ని  పట్టించుకోలేదని ఆవేదన                     


సీనియర్లను స్క్రాప్ కింద జమకట్టి షర్మిల ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. కార్యకర్తలకు కనీసం అండగా నిలబడలేదు. కనీసం ఏ ఒక్క సీనియర్ నాయకులు మాట్లాడే పరిస్థితి లేదు ఇంచార్జ్ మనిక్కం టాగోర్ కూడా అంతేగా ఉన్నారన్నారు. ఎన్నికలకు రాష్ట్ర పర్యటన కూడా చేయలేదు, రాహుల్ గాంధీ వచ్చిన రోజు మినహా ఏ రోజు రాష్ట్రానికి రాలేదు. షర్మిల వ్యవహారంపై ఢిల్లీలో తేల్చుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.  వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు.. షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.        


విజయవాడ ఎంపీ టిక్కెట్ దక్కలేదని అప్పట్లో పద్మశ్రీ అసంతృప్తి                                                             


టిక్కెట్ల కేటాయింపు సమయంలోనూ సుంకర పద్మశ్రీ అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు టిక్కెట్ ను ఆమెకు ప్రకటించారు.అయితే తాను ఎంపీ టిక్కెట్ ను అడిగానని తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు.