Andhra Pradesh New Liquor Policy Released: ఏపీలో మందుబాబులు లబోదిబోమంటున్నారు. వైన్ షాపులు బంద్ కావడమే వారి బాధకు కారణం. వైన్ షాపుల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి సోమవారంతో ముగిసిపోయింది. అయినప్పటికీ మరో 10 రోజుల పాటు షాపులను తెరవాలని కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం కోరింది. అయితే, ప్రైవేట్ వైన్ షాపులు వస్తున్నాయని... దీంతో పది రోజుల తర్వాత తమ ఉద్యోగాలు ఉండవని కాంట్రాక్టు ఉద్యోగులు చెప్తున్నారు. అందుకే మంగళవారం నుంచే విధుల్లోకి రాలేమని వారు స్పష్టం చేశారు. ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,240 వైన్ షాపులు మూతపడ్డాయి. దీంతో మందుబాబులకు బార్లకు వెళ్లడం మినహా మరో అవకాశం లేకుండా పోయింది. బార్లలో మందు ధరలను భరించలేని వారు.. మందు తాగకుండా పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
కొత్త మద్యం పాలసీ
ఈ నెల 12వ తేదీ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ రానుంది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా కొత్త వైన్ షాపులు ఏర్పాటు కానున్నాయి. అలాగే ఏపీ కొత్త మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలకాలనే నిర్ణయానికి వచ్చింది. మంగళవారం నుంచి ఈ నెల 9 వరకు ప్రైవేట్ మద్యం షాపుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నెల 11న 3,396 షాపులకు లాటరీ తీయనున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి లైసెన్సుదారులు షాపుల్ని ప్రారంభించుకోవచ్చు.
రుసుం రూ.2లక్షలు
ఎక్సైజ్ శాఖ దరఖాస్తు రుసుం రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఈ డబ్బులు దరఖాస్తు తర్వాత తిరిగి చెల్లించబడదు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఏర్పాటయ్యే ప్రాంత జనాభాను బట్టి లైసెన్సు ఫీజులు నాలుగు శ్లాబుల్లో ఉంటాయి. 10 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.50 లక్షలుగా నిర్ణయించారు. 10,000 నుండి 50,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు. 50,001 నుంచి 5 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో లైసెన్స్ ఫీజు రూ.65 లక్షలు. రూ.5 లక్షల ఆదాయం దాటిన నగరాల్లో గరిష్ట రుసుము రూ.85 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఫీజులను 6 విడతలుగా చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అలాగే లైసెన్స్ ఫీజుతో పాటు వారికి ఇచ్చే మార్జిన్‌ను ఈసారి రెట్టింపు చేశారు. ఇంతకు ముందు ఇది 10 శాతం ఉంటే, ఇప్పుడు 20 శాతం మార్జిన్ వ్యాపారులకు వెళ్తుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా దరఖాస్తు చేసుకునే వీలుంది. ఓ వ్యక్తి ఎన్ని అప్లికేషన్లు అయినా పెట్టుకోవచ్చు.
ప్రీమియం షాపులు కూడా..
రాష్ట్రంలో ప్రభుత్వం నోటిఫై చేసిన 3,396 మద్యం దుకాణాలతో పాటు 12 ప్రీమియం షాపులను కూడా ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురంలో ఇవి ఏర్పాటు కానున్నాయి. ఈ దుకాణాల లైసెన్స్ ఫీజును ఐదేళ్ల కాలానికి ఏడాదికి రూ.కోటిగా నిర్ణయించారు. అంతేకాదు రాష్ట్రంలో మద్యం ధరలు కూడా తగ్గించి.. ఎంఆర్పీల ప్రకారం క్వార్టర్ మద్యం రూ.99కి అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. మరోవైపు గీత కార్మికుల కేటగిరీ కింద వచ్చే 6 కులాలకు 340 మద్యం షాపులను కేటాయిస్తారని.. త్వరలోనే క్లారిటీ రానుంది.