అమరావతిలో ల్యాండ్ పూలింగ్, ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులన్నీ తేలిపోయిన తర్వాత రాత్రికి రాత్రి కొత్తగా ఇన్నర్ రింగ్ రిడ్ అలైన్ మెంట్, మాస్టర్ ప్లాన్‌లో అక్రమాల కేసులు పెట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం వెంటనే కేసులు నమోదు చేయడం.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ-1గా పెట్టడం చకచకా జరిగిపోయాయి. నారాయణను టెన్త్ పేపర్ల లీక్ కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి ఈ కేసులోనూ అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. అసలు ఈ కేసేంటి ? ఆళ్ల ఏమని ఫిర్యాదు చేశారో చూద్దాం..


అమరావతి మాస్టర్ ప్లాన్‌లో  ఇన్నర్ రింగ్ రోడ్డు !


అమరావతి నుంచి విజయవాడ చుట్టూ  గుంటూరు జిల్లాలోని కొంత ప్రాంతాన్ని కలుపుతూ  75 మీటర్ల వెడల్పుతో నిర్మించే 94.5 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్‌రోడ్డును అమరావతి మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించారు.   కృష్ణా నదిని ఆనుకుని గుంటూరు జిల్లా పరిధిలో వైకుంఠపురం, పెద్దమద్దూరు, కర్లపూడి, మోతడక, నిడుముక్కల, తాడికొండ, కంతేరు మీదుగా ఐఆర్‌ఆర్ జాతీయ రహదారిలో కలుస్తుంది.  తాడిగడప-ఎనికేపాడు మధ్య ఉన్న 100 అడుగుల రోడ్డుకు ఐఆర్‌ఆర్‌ను కలపాలనేది ప్రతిపాదన. అక్కడి నుంచి వీజీటీఎం-ఉడా హయాంలో మొదలైన రామవరప్పాడు రింగ్ వద్ద నిర్మాణంలోని ఐఆర్‌ఆర్‌కు కలిపి గొల్లపూడి వరకు తీసుకువెళ్లాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. 


రియల్ ఎస్టేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా అలైన్ మెంట్ మార్చారని ఎమ్మెల్యే ఆళ్ల ఫిర్యాదు !


విజయవాడ, గుంటూరు మధ్య చాలా కాలంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రామకృష్ణ హౌసింగ్, లింగమనేని ఎస్టేట్స్ వంటి కంపెనీలు రాష్ట్ర విభజనకు ముందే పెద్ద పెద్ద అపార్టుమెంట్లు నిర్మించి అమ్ముతున్నాయి. అక్కడ చాలా కంపెనీలకు భూములున్నాయి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు లాభం కలిగించేలా వారి భూములకు విలువ పెంచేలా అలైన్‌మెంట్ మార్చారని ఆళ్ల సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజానికి అలైన్‌మెంట్ మార్చడం అనేది లేదు.. ఎందుకంటే మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ప్రభుత్వమే ఇన్నర్ రింగ్‌రోడ్ ని ఖరారు చేసింది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఖరారులో అనేక అంశాలను పరిశీలనలోకి తీసుకుంటారు. ఇవన్నీ అధికారులు చూసుకుంటారు. చివరికి కేంద్ర ప్రభుత్వ అనుమతితో  నిర్మాణం ప్రారంభిస్తారు. 


నష్టపోయామని ఏ  ఒక్క బాధితుడూ ఫిర్యాదు చేయలేదు!


ఏ కేసులో అయినా తాము నష్టపోయామని బాధితులు కేసులు పెడుతూ ఉంటారు. కానీ అమరావతి కేసుల్లో మాత్రం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తూంటారు. సీఐడీ కేసులు నమోదు చేస్తూ ఉంటారు. ఈ ఐఆర్ఆర్ అలైన్‌మెంట్ ఖరారులో అవినీతి జరిగిందని.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ ఎమ్మెల్యే మాత్రం సామాన్యులకు .... ప్రజల ఆస్తులకు నష్టం చేకూర్చారని ఫిర్యాదు చేశారు. ఎవరికి నష్టం చేశారు...? ఎలా నష్టపోయారు? అన్న అంశాలు ఎఫ్ఐఆర్‌లో లేవు. 


పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది !


సీఐడీ పోలీసులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారని.. ప్రాథమిక దర్యాప్తు నిర్వహించామని.. ఆ దర్యాప్తులో ఆధారాలున్నాయని కేసులు పెట్టామని ఎఫ్ఐఆర్‌లో చెప్పారు. అంతే తప్ప.. ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అవన్నీ పోలీసులు ప్రకటించిన తర్వాత ఈ కేసు రాజకీయంగా పెట్టారా లేదా అనేది తేలే అవకాశం ఉంది.