Thota Trimurtulu Case :  వైసీపీ మండపేట అభ్యర్థి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధించడం సంచలనంగా మారింది. అసలు కేసు ఏంటి ? ఆ తర్వాత ఏం జరిగింది ? ఆ వివరాలు ఇవీ.. 


అసలేం జరిగిందంటే ? 


1982 ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరిన తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. కానీ అది నెరవేరకపోవటంతో 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గంట గుర్తుపై పోటీ చేసిన తోట త్రిమూర్తులకు టీడీపీ, బీఎస్పీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే ఇదే టైమ్ లో తోట త్రిమూర్తులు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారు అంటూ ఓ ఐదుగురు బీఎస్పీ బూత్ ఏజెంట్ కుర్రాళ్లు గొడవకు దిగారు. ఆ గొడవ బాగా పెద్దగా జరిగింది. తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు. తోట త్రిమూర్తులు  మూడువేల ఓట్ల మెజార్టీతో అనూహ్యంగా ఆ ఎన్నిక గెలిచి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయ్యారు. కానీ అప్పటి నుంచి తనను అవమానించిన ఆ కుర్రాళ్లపై కక్షసాధింపులు మొదలుపెట్టారని స్థానికులు చెబుతూ ఉంటారు.


1996 డిసెంబర్ 29న దళిత యువకులకు శిరోముండనం


1996 డిసెంబర్ 29న రామచంద్రాపురం మండలంలోని వెంకటాయపాలెంలో ఐదుగురు దళితయువకులను ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మనుషులు పట్టుకున్నారు. పొలం చుట్టూ ఫెన్సింగ్ ధ్వంసం, ఈవ్ టీజింగ్ కారణాలు చెప్పి ఆ ఐదుగురు కుర్రాళ్లను ఊళ్లో అవమానిస్తూ ఊరేగించారు. అంతటితో ఆగకుండా అందులో ఇద్దరు కుర్రాళ్లకు గుండు కొట్టించి కనుబొమ్మలు గీయించారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చేయించిన ఈ పని అప్పట్లో సంచలనంగా మారిపోయింది. ఆ బాధితులైన కుర్రాళ్లు పోలీసులను ఆశ్రయించారు. 1997 జనవరి 1న ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ లో మొదటికేసుగా దళితుల శిరోముండనం కేసు నమోదైంది. 


మూడు నెలల పాటు జైల్లో ఉన్న తోట త్రిమూర్తులు


అప్పట్లో త్రిమూర్తులు మూడునెలల పాటు జైల్లో ఉన్నారు. కానీ తర్వాత కేసును పక్కన పెట్టేశారు.  బాధితులు మాత్రం పోరాటం చేస్తూనే ఉన్నారు. శిరోముండనం జరిగిన ఇద్దరు బాధితుల్లో ఓ వ్యక్తి మృతి చెందారు. మిగిలిన నలుగురు పోరాటం కొనసాగించారు. కేసుకు సంబంధించిన 24మంది సాక్ష్యుల్లో 11మంది వేర్వేరు కారణాలతో చనిపోయారు. అయినా ఈ పోరాటం ఆగలేదు. హైకోర్టుకు వెళ్లారు బాధితులు. హైకోర్టును జిల్లా కలెక్టర్ ను, విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించి ఆరునెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. 


వారు దళితులు కాదని వాదిస్తూ వచ్చిన తోట త్రిమూర్తులు


ఈ లోగా తోట త్రిమూర్తులు అసలు ఆ యువకులు ఇద్దరూ దళితులు కాదని..వాళ్లలో ఒకరి అమ్మ మృతి చెందినప్పుడు ఆ సమాధిపై శిలువ గుర్తు వేయించారని..క్రైస్తవంలోకి మారిన కారణంగా బీసీ కిందకు వస్తారని ఈ కేసు ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ తగదని తోట త్రిమూర్తులు వాదిస్తూ వచ్చారు. ఊళ్లో పంచాయతీ పెద్దలు చేయించిన పనిని తన మీద రుద్దటానికి చూస్తున్నారని చెబుతూ వచ్చేవారు. కానీ ఆ యువకులు క్రైస్తవులు అని సాక్ష్యాలు చెప్పేలా అధికారులను తోట త్రిమూర్తులు ప్రభావితం చేశారన్న బాధితుల వాదనతో ఏకీభవించిన విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తోట త్రిమూర్తులకు 18నెలల జైలుశిక్ష..2లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఎనిమిదోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో దిగుతున్న తోట త్రిమూర్తులకు షాక్ ఇచ్చింది.