Andhra BJP : ఆంధ్రప్రదేశ్  బీజేపీలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ సీనియర్ నేతలకు సోము వీర్రాజు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. అదే సమయంలో పార్టీలో ఉంటూ టీడీపీతో పొత్తు కు అనుకూలంగా మాట్లాడుతున్న వారిపైనా ఫైర్ అవుతున్నారు. దీంతో ఎన్నికలకు ముందు ఏపీ బీజేపీలో గందరగోళ పరిస్థితులు ఎదురవుతున్నాయి. 


విష్ణుకుమార్ రాజుకు షోకాజ్ నోటీసులు 


రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు రాదంటూ ఓ తెలుగు టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో చేసిన వ్యాఖ్యల పైన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు షోకాజ్‌ నోటీసు జారీ చేసారు. దీని పైన విష్ణుకుమార్‌రాజు వివరణ ఇచ్చారు. పార్టీ ఇచ్చిన నోటీసులో అర్దం లేదనే వాదన ఉంది. తాజాగా మాజీ ఎంపీ టీజీ వేంకటేష్ నూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం  అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సల్లో ఆయన  ఫోటో ఉండటమే దీనికి కారణం. తన కుటుంబసభ్యులు  టీడీపీలో ఉన్నారని..  వారు ఫోటో వేస్తే తన తప్పేమిటని టీజీ వెంకటేశ్ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటిని సోము వీర్రాజు వినిపించుకోడం లేదు. 


పొత్తుల అంశంతోనే అసలు సమస్య 


బీజేపీలో వచ్చే ఎన్నికలకు సంబంధించిన పొత్తుల అంశం కాక రేపుతోంది. ఏపీ బీజేపీలో చాలా రోజులుగా వైసీపీ అనుకూల..టీడీపీ మద్దతు దారుల నేతల మధ్య అభిప్రాయ బేధాలతో రెండు గ్రూపులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా మారటంతో ఆ రెండు పార్టీలతో కలిసి వెళ్లాలనే అభిప్రాయం కొందరు బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కొందరు ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు వైసీపీకి పరోక్ష మద్దతు దారులుగా ఉన్న ఏపీ బీజేపీలోని కొందరు నేతలకు రుచించటం లేదు. వీరి వ్యాఖ్యల పైన జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఏపీలో రాజకీయంగా అమలు చేయాల్సిన కార్యాచరణ పైన కర్ణాటక ఫలితాల తరువాత నిర్ణయిస్తామని బీజేపీ అగ్రనాయకత్వం స్పష్ట చేసింది.


బీజేపీలో ఆధిపత్య పోరాటం  పెరుగుతోందా ?


సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వతా కూడా ఇలా షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లతో హోరెత్తించారు. పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడారంటూ లంకా దినకర్ సహా చాలా మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే కొంత మంది కోవర్టులనే అనుమానంతో చూశారు. ఇలా చేయడంతో సోము వీర్రాజుకు వ్యతిరేకంగాఓ వర్గం బలంగా తయారయింది. కన్నా లక్ష్మినారాయణ పార్టీ నుంచి వెళ్లిన తర్వాత సోము వీర్రాజును తొలగించాలంటూ ఓ బృందం ఢిల్లీ కూడా వెళ్లింది. అయితే  హైకమాండ్ వారి మాటలు వినిపించుకోలేదు. కానీ సోముకు వ్యతిరేకంగా బలమైన వర్గం మాత్రం బీజేపీలో బలం పుంజుకుంది. వచ్చే ఎన్నకిల్లో ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లడం చాలా మందికి ఇష్టం లేదు. పొత్తులు లేకపోతే గెలవలేమని .. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిణామాలతో ఏపీ బీజేపీ క్రాస్ రోడ్స్ లో ఉంది. ముందు ముందు ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.