Janasena Rythu Bharosa Yatra : వైసీపీ అంటే తనకు ద్వేషం లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. కానీ వైసీపీ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నిలదీస్తానన్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ పాల్గొన్నారు. అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేన తరఫున ఆర్థికసాయం అందిస్తున్నారు. చింతపూడిలో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూ కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. కౌలు రైతుల సమస్యలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తనను దత్తపుత్రుడని ఇంకోసారి అంటే సీబీఐ దత్తపుత్రుడు అని తానూ అనాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. చంచల్‌గూడ జైల్లో షటిల్‌ ఆడుకున్న వారంతా తనకు నీతులు చెప్పేది అని మండిపడ్డారు. 






పవన్ రోడ్డుపైకి వస్తే కానీ కౌలు రైతులు గుర్తురాలేదు


రాష్ట్రంలో కౌలు రైతులను ఆదుకునేవారు లేకుండా పోయారని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన చెందారు. కౌలు రైతుల సమస్యలను గుర్తించి, ప్రభుత్వం వారికి అండగా ఉండాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులు అప్పులు తీసుకుని వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడడంపై పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నారన్నారు. ఇప్పటి వరకు 3 వేలకు పైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం సృష్టించిందని తాను చెప్పడంలేదని, ఆ సమస్యలను ప్రభుత్వం గుర్తించకపోవడం వల్లే తాను బయటకు రావాల్సి వచ్చిందన్నారు. ఇవాళ సభకు వచ్చిన వారిలో చాలా మంది వైసీపీ ఓటేసి ఉండవచ్చని పవన్ అన్నారు. తనపై వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నప్పటికీ రాజకీయంగా జగన్‌కు ఓటేశారని, దానిని స్వాగతిస్తానన్నారు. తాను ఒక్కొ మెట్టు ఎక్కాలనుకునేవాడిన్నారు. తనను రెండు చోట్ల ఓడించినా ప్రజల కోసమే పోరాడుతున్నానని గుర్తుచేశారు. వైసీపీకి ఇంత మెజారిటీ ఇచ్చిన ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 


వైసీపీ అంటే ద్వేషం లేదు కానీ 


"వైసీపీ అంటే నాకు ఎలాంటి ద్వేషం లేదు. ప్రజల కన్నీళ్లు తుడవకపోతే గ్రామాల్లో ఎందుకు గ్రామ సచివాలయాలు?. జనసేన పోరాడితే తప్ప మీకు సమస్యలు గుర్తుకురావా? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే గట్టిగా అడుగుతాం. రైతుల సమస్యలపై పోరాడితే మీ నాయకుడు మమ్మల్ని దత్తపుత్రుడు అంటాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా మర్యాదగా మాట్లాడాను. ఇంకొకసారి దత్తపుత్రుడు అంటే మాత్రం సహించేది లేదు. ఇలాగే కొనసాగితే జగన్ ను సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది." అని పవన్ అన్నారు. 


నేనెవరికీ దత్తపుత్రుడు కాదు 


తాను ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తున్నానని, వ్యక్తిగతంగా ఎవరినీ దూషించడంలేదని పవన్ అన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం చాలా నీచంగా దూషిస్తున్నారన్నారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి స్థానానికి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నానన్న  పవన్ కల్యాణ్, ఇంకోసారి దత్తపుత్రుడు అంటే సీబీఐకి దత్తపుత్రుడు అనే మాటను ఫిక్స్ చేస్తామన్నారు. కష్టాల్లో ఉన్నవారంతా తన సొంతవాళ్లే అన్నారు. అనంతపురం సభ తర్వాత నర్సాపురం ఎంపీ తనకు కాల్ చేసి కొన్ని సూచనలు చేశారన్నారు. కొన్ని సరిదిద్దుకోవాలన్నారు. అనంతపురం సభలో చర్లపల్లి షటిల్‌ టీం అన్నానని, అది చర్లపల్లి కాదు చంచల్‌గూడ షటిల్‌ టీం అని ఆయన చెప్పారన్నారు. తానేవరికీ దత్తత వెళ్లలని, దత్తత తీసుకుంటే ఎవరూ భరించలేరని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.