Weather Updates:  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావం తగ్గింది. ప్రస్తుతం వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరిత ఆవర్తనం మద్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో నేడు (మే 6న) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. తదుపరి 48 గంటలలో వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాం..
ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలైన ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, యానాం ప్రాంతాల్లో నేటి నుంచి మరో మూడు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఒకట్రెండు చోట్ల గాలులు వీచే అవకాశం ఉంది. 


దక్షిణ కోస్తాంధ్రలో ఇలా..
ఈ ప్రాంతంలోనూ మూడు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సూచించారు. రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈదురుగాలులు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. 


రాయలసీమలో తేలికపాటి జల్లులు..
రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుంటాయి. గడిచిన 24 గంటల్లో రాయలసీమలోని కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 41.6 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. అత్యధిక వర్షపాతం తిరుపతిలో 38.5 మిల్లీమీటర్లుగా నమోదైందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.






నిప్పుల కొలిమిలా తెలంగాణ..
దక్షిణ అండమాన్‌లో నేడు ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మే 7 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఒకట్రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.






 


Temperature in Andhra Pradesh, Telangana Temperature Today