దక్షిణ థాయిలాండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి డిసెంబరు 2వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ తర్వాత 24 గంటల్లో తీవ్రమై తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. మరింత బలపడిన తర్వాత.. డిసెంబరు 4వ తేదీన ఉత్తరాంధ్ర-ఒడిశా తీరానికి వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అల్పపీడనం తుపానుగా మారి డిసెంబరు 4వ తేదీ వరకు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని.. ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబరు 2 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ కారణంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను కారణంగా కోస్తాంధ్ర తీరం వెంట 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.