Southwest Monsoon : దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతం వరకు సముద్రమట్టంపై 0.9 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని చోట్ల, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల వైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర, సెంట్రల్ బెంగల్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయాలు, పశ్చిమ బెంగాల్, సిక్కింలను తాకనున్నాయి. ఆకాశం మేఘావృతమై కనిపిస్తున్నా ఉక్కపోత, వేడి అధికంగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. 


ఆంధ్రప్రదేశ్, యానాంలలో..
ఈ రోజు ఎండల వేడి మరింత ఎక్కువగా ఉండనుంది. నిన్నటితో పోలిస్తే గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఉత్తర ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల మధ్యాహ్నం సమయానికి 47 డిగ్రీలను తాకనుంది. ఈ రోజు కోస్తాంధ్రలో వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. కొన్ని చోట్ల మేఘావృతమై ఉంటుందేమో కానీ, చాలా ప్రాంతాల్లో వడగాల్పులు ఎక్కువ. మరో వైపున చిత్తూరు - కర్ణాటక సరిహద్దు ప్రాంతం మీదుగా ఏర్పడుతున్న గాలుల వల్ల చిత్తూరు, అన్నమయ్య జిల్లా (మదనపల్లి) పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేఘాలు భూమిలో నుంచి వచ్చే వేడిని భయట వెళ్లనివ్వకుండా ఆపడం వల్ల ఉక్కపోత ఎక్కువౌతుంది. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్యలు అధికం కానున్నాయి. తాగునీరు, పండ్ల రసాలు అధికంగా తీసుకోవడం వల్ల కాస్తంత ఉపసమనం ఉంటుంది.



రాజమండ్రిలో అత్యధికం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ అత్యధికంగా 46.1 డిగ్రీల వేడి నమోదయ్యింది. బెజవాడలో 45.3 డిగ్రీలు, ఏలూరులో 44.9 డిగ్రీలు, గుంటూరులో 44.8 డిగ్రీలు, అమరావతిలో 44.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 33 డిగ్రీలు, కళింగపట్నంలో 33.2 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో కోస్తాంధ్ర కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. ఎండలు ఉన్నాయి కానీ కోస్తాంధ్రతో పోలిస్తే రాయలసీమలో కాస్తంత తక్కువగానే కనిపిస్తోంది. రుతుపవనాలు రాయలసీమ ను జూన్ 6 / 7 న తాకనున్నాయి. విజయవాడ, హైదరాబాద్, ఉభయ గోదావరి మీదుగా జూన్ 11 న తాకనుంది. 


కూల్ కూల్‌గా తెలంగాణ..
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. తెలంగాణలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.