AP Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి తమిళనాడు తీరం వైపుగా కదులుతుందని, దీని ప్రభావం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌, యానాంలలో ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంట ప్రస్తుతం 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని హెచ్చరించింది. ఏపీలో కొన్ని జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. 


బంగాళాఖాతంలో అరుదైన అల్పపీడనం.. (Deep Depression In Bay Of Bengal)
బంగాళాఖాతంలో మార్చి నెలలో 28 ఏళ్ల తరువాత అల్పపీడనం గానీ, వాయుగుండం ఏర్పడ్డాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 1994 మార్చి 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తరువాత తాజాగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ఏర్పడ్డాయి. ఈ నెలలో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటాన్ని అరుదైనది విషయమని  వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.  


శ్రీలంకలోని ట్రింకానమలీకి 340 కి.మీ ఈశాన్యంగా, తమిళనాడు నాగపట్నానికి తూర్పు ఈశాన్యంగా 300 కి.మీ దూరంలో, పుదుచ్చేరికి 470 కి.మీ దూరంలో, వాయువ్య చెన్నైకి 300 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఈశాన్య దిశ నుంచి ఏపీ, యానాంలలో బలమైన గాలులు (North Easterly to easterly winds prevail over andhra pradesh) వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం ఎఫెక్ట్, ఆగ్నేయ గాలుల ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. 






దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు.. 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో దక్షిణ కోస్త్రాంధ్ర, రాయలసీమలో నేడు వర్షాలు కురవనున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. చిత్తూరు, అనంతరపురం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని చోట్ల బలమైన గాలులు వీచడంతో ఉష్ణోగ్రత తగ్గుతుంది.


తెలంగాణ వెదర్ అప్‌డేట్..
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వాతావరణంలో స్వల్ప మార్పులు జరుగుతాయి. పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈశాన్య దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు ఉండగా, పగటిపూట గరిష్టంగా ఒకట్రెండు చోట్ల 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.