Weather update: నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన పరిసర ప్రాంతాల్లో 7.6 కిలో మీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. వాయువ్య దిశగా పయనిస్తూ, ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ మధ్య తమిళనాడు, పుదుచ్ఛేరి మధ్యకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ నెల 10, 11వ తేదీల్లో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే సూచనలు ఉన్నాయన్నారు. ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 


ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ తెలిపారు. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని శనివారంలోపు వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు పయనించే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో శక్రవారం, శనివారం రెండు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.


దక్షిణాంధ్ర - తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టుప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు కింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..


అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 11, 12, 13 తేదీల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మాత్రం తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వానలు పడతాయి. ముఖ్య నగరాలైన వైజాగ్, విజయవాడలో అల్పపీడనం అంతగా ప్రభావం చూపకపోవచ్చు. నవంబర్ 12 నుంచి 15 తేదీల్లో ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గాలులు వీచడంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఈశాన్య రుతుపవనాలు ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నాయి. నేడు ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో వాతావరణం పొడిగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..


ఈ ప్రాంతాల్లో నవంబర్ 11 నుంచి మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 14 నుంచి వర్షాలు 16 తేదీలలో క్రమంగా వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. అత్యధిక వర్షాలు తిరుపతి, నెల్లూరు జిల్లాలలో ఉంటాయి. నవంబర్ 12 నుంచి అల్పపీడనం ప్రభావం తిరుపతి, నెల్లూరు జిల్లాలతోపాటుగా కడప, అన్నమయ్య, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల మీదుగా ఉండనుంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో 13న వర్షాలు కురవనున్నాయి. ఆ సమయానికి అల్పపీడనంగా బలహీనపడి అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతంలో ఉన్న తేమను లాగుతుంది. నవంబర్ 14 నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.