Another Cyclone to Andra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాన్‌ గండం పొంచి ఉంది. మిగ్‌జామ్‌ మిగిల్చిన నష్టం నుంచి తేరుకోకముందే.. ఇంకో తుపాన్‌ రాబోతోంది.  మిగ్‌జామ్‌ తుపాన్‌ ఎఫెక్ట్‌తో ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడు మరో తుపాన్‌ రాబోతోందన్న వార్త... రైతుల  గుండెల్లో గుబులు రేపుతోంది. 


డిసెంబర్‌ 16న... బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. అది ఈనెల 18కి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దీని గమనం శ్రీలంక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వైపు కొనసాగుతోందని చెప్తున్నారు. ముఖ్యంగా కేరళపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే... తమిళనాడు, కేరళ, కర్నాటకను దాటుకుని రావడానికి కొంత సమయం పట్టినప్పటికీ.... ఈ అల్పపీడనం భారీ తుపాన్‎గా ఏర్పడే అవకాశం ఉన్నట్టు హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ  అధికారులు. ఇదే జరిగితే మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తే... డిసెంబర్ 21 నుంచి 25 వరకు ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తుపాన్‌తో కూడా పెను ముప్పు సంభవించవచ్చని చెప్తున్నారు. రైతులు తమ పనులను డిసెంబర్ 15వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. 


మిచౌంగ్ తుపాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో, కోస్తాలో వర్షాలు కురిశాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో మిగ్‌జామ్‌ బీభత్సం సృష్టించింది. రహదారులు దెబ్బ తిన్నాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గంటల తరబడి గ్రామాలకు గ్రామాలు అంధకారం వెళ్లాయి. ఇప్పుడిప్పుడు తుపాన్‌ ఇబ్బందుల నుంచి కోలుకుంటున్న క్రమంలో... మరో తుపాన్ గండం ఉందన్న వార్త ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రైతుల పరిస్థితి మరీ అగమ్యగోచరంగా ఉంది. పంటలు చేతికొచ్చిన వేళ... తుపానులు విరుచుకుపడటం... అన్నదాతల పాలిట శాపంగా మారుతోంది. కోతల వేళ... కన్నీళ్లు మిగులుస్తుందని లబోదిబోమంటున్నారు రైతన్నలు. 


తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరుగుతోంది. తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలకు పడిపోయాయి. పగటివేళ గరిష్టంగా 28 డిగ్రీలుగా ఉంటోంది ఉష్ణోగ్రతల.  ఆంధ్రప్రదేశ్‌లో అయితే... రాత్రి వేళ 21 డిగ్రీల సెల్సియస్, పగటి పూట గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. నేడు... దక్షిణ రాయలసీమ, ఉత్తర తెలంగాణలో చలి  ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో వచ్చే చలిగాలులు ప్రమాదకరమైనవి... వాటి వల్ల జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని  హెచ్చరించింది. దక్షిణ రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... చలిగాలి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఉత్తర తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి  బాగా పెరుగుతుందని... అక్కడి ప్రజలు కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. 


మిగ్‌జామ్‌ బాధితులకు నష్టపరిహారం అందించే పనిలో బిజీగా ఉన్న జగన్‌ సర్కార్‌.. మరో తుఫాన్‌ రాబోతుందన్న వార్తలతో మరింత అలర్ట్‌ అవుతోంది. ముందస్తు చర్యలకు మరోసారి సిద్ధమవుతోంది. తుఫాన్లు వెంటాడుతుండటంతో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేస్తోంది.