ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల 10 నుంచి 15 సెం.మీ వర్షపాతం నమోదైంది. గరిష్ఠంగా విజయనగరంలో 14.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరో మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అయితే మరో రెండు, మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తరం బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం లలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కి మీ వరకు విస్తరించి ఉంది. ఇది నైరుతి దిశకు కొనసాగుతున్నది. దీని ప్రభావం వలన ఉత్తర, మధ్య బంగళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ అధికారులు ఆదివారం తెలిపారు.
సోమవారం, మంగళవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ విభాగం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు తీరం వెంబడి ఈదురుగాలులు 40-50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.
సోమవారం, మంగళవారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమలో సోమవారం, మంగళవారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.
సోమ, మంగళవారాల్లోనూ అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంపై గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో సోమవారం అక్కడే అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా. తెలంగాణ పక్కనే మరఠ్వాడాపై 4.5 కిలోమీటర్ల ఎత్తున గాలులతో మరో ఉపరితల ఆవర్తనం ఉంది. రుతుపవనాల గాలుల ద్రోణి దిల్లీ బాలంగీర్, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకూ వ్యాపించింది.
భూమికి 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలుల్లో అస్థిరత ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి వల్ల అక్కడక్కడ లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలున్నాయని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ సూచించింది.