తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో నేడు కూడా వర్షాలు బాగా పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. కొన్ని చోట్ల భారీ వర్ష సూచనతో ఐఎండీ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఉత్తర భారతం నుంచి తిరోగమన దారిలో పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు తెలంగాణపై నుంచి చురుగ్గా కదులుతున్నాయి. దీనికి తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున స్థిరంగా కొనసాగుతోంది. అక్టోబర్ 1వ తేదీ నాటికి ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ప్రజలు ఈ విషయం గుర్తించాలని సూచించారు.
ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో (సెప్టెంబరు 29, 30) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ప్రాథమిక హెచ్చరిక అయిన ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతోపాటు నైరుతి రుతుపవనాల కారణంగా గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ అధికారులు అంచనా వేశారు. సెప్టెంబరు 30 తర్వాత ఒకటి రెండు రోజులు పొడి వాతావరణం ఏర్పడుతుందని, ఆ తర్వాత మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గడిచిన ఒక రోజులో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
గడిచిన 24 గంటల్లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, కొమురంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్యానికి ఆనుకొని ఉన్న తూర్పు- మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 1వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలో వాతావరణం ఇలా
ఏపీలో మరో 4 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షం నమోదు కానుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం సూచన ప్రకారం.. ఈ ప్రాంతాల్లో అక్టోబర్ 1 వరకు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపుతూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో, యానాంలోనూ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. గాలులు వేగంగా వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని హెచ్చరించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఈ ప్రాంతాల్లో మరో నాలుగు రోజులపాటు మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్, అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేశాయి. మరో నాలుగు రోజుల వరకు ఈ ప్రాంతాలకు వర్ష సూచనతో ఎల్లో వార్నింగ్ జారీ అయింది. రాయలసీమలోనూ భారీ వర్షాలున్నాయి. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాలతో పాటు అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలున్నాయి. నీళ్లు నిలిచి ఉంటే చోట జాగ్రత్తగా ఉండాలని, నీటి ప్రవాహాన్ని దాటి వెళ్లే ప్రయత్నాలు చేయకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు.