తిరుమల శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకుడు ట్వీట్ ద్వారా ఆరోపించిన విషయంలో వాస్తవం లేదని ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల్ దీక్షితులు స్పష్టం చేశారు. తిరుమలలోని అర్చక‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణ దీక్షితులు మాట్లాడుతూ.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సీఎంను నాలుగు వంశీయుల అర్చకులు కలిసామన్నారు. అర్చక వ్యవస్ధ విధి విధానాలు గురించి తెలియజేసామని చెప్పారు. 


సుప్రీం కోర్టు ఆదేశాలు అనుసరించి 850 జీవో ప్రకారం ప్రస్తుతం తమ అర్చక విధానం రెగ్యులర్‌గా కొనసాగుతుందన్నారు.  వంశపారంపర్యంగా హక్కులను పునరుద్ధరణ చేయాలని సీఎంని‌ కోరినట్టు వివరించారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించడం చాలా సంతోషమన్నారు కృష్ణ దీక్షితులు. టిటిడిలో అర్చకులకు 142 సెక్షన్‌ని అమలు పరుస్తున్నామని సర్వీసుని రెగ్యులర్ చేయడం జరిగిందని, వంశపారంపర్యంగా గతేడాది ఎనిమిది మంది పిల్లలను టిటిడిలో అర్చకులుగా నియమించినట్టు తెలిపారు. నాలుగు రోజుల క్రితం మరో నలుగురికి టిటిడి స్వామి వారి కైంకర్యం చేసుకునే భాగ్యం కలిగించిదన్నారు. 


1997లో మిరాశి వ్యవస్ధ రద్దు చేసినప్పటి నుంచి నేటి వరకూ తమ సర్వీసులో తమకు రావాల్సిన బకాయిలు సీఎం దృష్టికి తీసుకెళ్ళామని, అయితే టిటిడి ఈవోకి ఆదేశాలు జారీ చేస్తూ తగ్గిన చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారన్నారు కృష్ణ దీక్షితులు.  తమ వంశీయుల్లో వితంతువులకు గౌరవ వేతనం ఇవ్వాలని సీఎంను కోరామని, దీనిపై కోర్టు ఆదేశాల‌ మేరకు మంజూరు అయ్యే విధంగా ఏర్పాటు చేస్తామని సీఎం‌ హామీ‌ ఇచ్చారన్నారు. 


టిటిడి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వన్ మ్యాన్ కమిటీపై చేసిన ట్విట్‌లో‌ ఎటువంటి వాస్తవం లేదని, టిటిడిలో వన్ మ్యాన్ కమిటీ పర్యటించలేదని, తమను వన్ మ్యాన్ కమిటీ ఎప్పుడూ సంప్రదించలేదని కృష్ణ దీక్షితులు తెలియజేశారు. 


ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు మాట్లాడుతూ... సీనియర్ అర్చకులు రమ దీక్షితులు  చేసిన ట్వీట్‌లో వాస్తవం లేదని, 1997లో మిరాశి వ్యవస్ధను రద్దు చేసిన సమయంలో అర్చకులు అంతా కోర్టును ఆశ్రయించామని, రెండు సార్లు మిరాశి వ్యవస్ధను రద్దు చేయాలని కోర్టు ఆదేశాల మేరకు అర్చకులు అంతా విధుల్లో చేరారన్నారు. అప్పటి నుంచి నేటి వరకూ సంభావన క్రిందనే అర్చకులు అంతా విధులు నిర్వర్తిస్తున్నారని, 850 జీవోని అనుసరించి అర్చకులను అందరిని రెగ్యులర్ చేసుకున్నామని‌ వివరించారు. సీఎం 142 సెక్షన్‌ను పునరుద్దరిస్తామని హామీ ఇవ్వడం చాలా సంతోషమని ఆయన అన్నారు. 


రమణ దీక్షితులు‌ ట్విట్ తెలిపిన వన్ మ్యాన్ కమిటీ అనేది ఎవరికి తెలియదని, అర్చకులకు ఎవరికి వన్ మ్యాన్ కమిటీ వేసారన్నది కూడా తెలియదని, వంశపారంపర్యంగా వస్తున్న హక్కులను,142 సెక్షన్‌ను కొనసాగించాలనే సీఎంను కలిసామే తప్పా, ఇతర ఏ విషయాలు సీఎంతో‌ ప్రస్తావించలేదని వేణుగోపాల్‌ దీక్షితులు అన్నారు. అర్చకేతరులు ఎవరన్నది రమణ దీక్షితులకే తెలియాలని, ఒక వ్యవస్ధలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, అర్చకులు ఎవరూ ప్రభుత్వంపై అసంతృప్తితో లేరని, రిటైర్మెంట్ అనేది ఒక హోదా నుంచి దూరం మాత్రమే, స్వామి నుంచి గానీ, స్వామి కైంకర్యాల నుంచి టిటిడి ఎవరిని దూరం చేయలేదన్నారు. 


వన్ మ్యాన్ కమిటీ రిపోర్టు ఇంత వరకూ తమ ముందుకు రాలేదని, రమణదీక్షితులను ఎప్పుడూ ఎవరూ కలవలేదని, రమణ దీక్షితులు ఆయన తన వ్యక్తిగత ప్రాపకం కోసం పాటు పడుతున్నారని‌ ఇది సరైన విధానం కాదని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలియజేశారు..


టీటీడీలో బ్రాహ్మణ వ్యతిరేకశక్తులు ఉన్నాయంటూ రమణ దీక్షితులు ఉదయం వివాదాస్పద ట్వీట్ చేశారు. ఆ శక్తులు ఆలయ విధానాలతోపాటు అర్చక వ్యవస్థను నాశనం చేసేలోగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఆయన చేసిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి తిరుమల పర్యటన ముగించుకుని వెళ్లిన కొన్ని గంటల్లోనే రమణ దీక్షితులు ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో వంశపారంపర్య అర్చకత్వానికి సంబంధించి వన్‌మెన్‌ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌పై ప్రకటన చేస్తారని భావించారని రమణదీక్షితులు ప్రస్తావించారు.