బంగాళాఖాతంలో ఈ నెల 16న మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో నవంబర్‌ 18 నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. వచ్చే రెండు రోజుల్లో దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.






నెల్లూరులో భారీ వర్షాలు


ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నెల్లూరు నగరం జలమయం అయింది. ఆత్మకూరు బస్టాండ్, రామలింగాపురం, మాగుంట లే అవుట్‌లోని అండర్‌ బ్రిడ్జిల్లోకి నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మాగుంట లే అవుట్‌ అండర్‌ బ్రిడ్జిని బారికేడ్లు పెట్టి మూశారు. ఉమ్మారెడ్డి గుంటలోని పలు పల్లపు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది. కావలి చుట్టు పక్కల గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కుండపోత వానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏటా ఈశాన్య రుతుపవనాల వల్ల తమిళనాడు రాష్ట్రంలో అధికంగా వర్షాలు కురిసే సంగతి తెలిసిందే. ఈ రుతుపవనాల ప్రవేశించడంతో తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. ఈ వర్షాల ప్రభావం తమిళనాడును ఆనుకొని ఉన్న ఏపీ ప్రాంతాల్లో కాస్త ఉంటోంది.


తెలంగాణలో పరిస్థితి ఇలా..


హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేసిన వెదర్ బులెటిన్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉంటుంది. ఎక్కడా వర్ష సూచన లేదు. వచ్చే 3 రోజులు ఇలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.






హైదరాబాద్ లో ఇలా..


‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది, గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశల నుంచి గాలులు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. నిన్న మాత్రం గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30.8 డిగ్రీలు, 17.5 డిగ్రీలుగా నమోదైంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.