Asani Cyclone Effect Latest News: అసని తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా, వాయుగుండంగా, ఇప్పుడు అల్ప పీడనంగా మారింది. ఇది సంబధిత తుపాను ప్రసరణ మధ్య - ట్రోపోస్పిరిక్ స్థాయుల వరకూ విస్తరించినట్లుగా హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో మత్స్యకారులకు సైతం అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. 






ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. సాధారణ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములు, జల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు మాత్రం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. 






Telangana Weather తెలంగాణలో వాతావరణం ఇలా
అసని తుపాను ఎఫెక్ట్ తెలంగాణపై అంతగా లేదు. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో నేడు స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, జోగులాంబ గద్వాల, ఖమ్మం, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణ పేట, రంగారెడ్డి, వనపర్తి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.






మే 15 నాటికి దక్షిణ అండమాన్‌కు నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు 2022 మే 15 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.


‘‘అసని తుపాను కథ ఇక ముగిసింది, మళ్లీ ఎండలు, ఉరుములతో కూడిన వర్షాలు మొదలౌతాయి. మళ్లీ సాధారణ స్ధితికి రేపటి నుంచి వాతావరణం ఉండనుంది. ఎన్నో మలుపులు తిరిగిన అసానీ తుఫాను, అసలు మానవమాత్రులకు చెప్పడం సాధ్యం కాని విషయం. వెయ్యి మందికి పైగా పని చేస్తున్న వాతావరణ శాఖకైనా ఈ తుపాను ఒక సవాలే.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ రాసుకొచ్చారు.