ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ విభాగం అధికారులు ప్రకటించారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రకారం రాగల మూడు రోజులకు సంబంధించి అమరావతి వాతావరణ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ అంచనాలను వెల్లడించింది.
ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో నేటి నుంచి మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అంతేకాక, మెరుపులు, ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రలో కూడా నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంతంలో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.
తెలంగాణలో ఇలా..
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల వడగళ్ల వాన కూడా కురుస్తోంది. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం.. జనవరి 13న రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో కొన్ని జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు 17వ తేదీ వరకూ కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. వానలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.