బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీరం దాటింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి చెన్నైకి సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. వాయుగుండం ప్రభావంతో గురువారం ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం కూడా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. కడప, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని సమాచారం. వాయుగుండం భూభాగంపైకి వచ్చిన తర్వాత క్రమంగా బలహీనపడుతుందని, అప్పటి వరకు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.


ముంచి ఉన్న మరో ముప్పు.. 
వాయుగుండం తీరం దాటినా.. అండమాన్ తీరంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇది మరింత బలపడితే ఈనెల 17న కోస్తా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. దీంతో 13 నుంచి 18 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలుస్తోంది.


Also Read: పసిడి ప్రియులకు షాక్! భారీగా ఎగబాకిన బంగారం ధర.. ఏకంగా 50 వేలు దాటేసి.. తాజా ధరలివే..


తెలంగాణలో..
ఈ ప్రభావం ఏపీ మీదుగా తెలంగాణపై కూడా ఉంటుందని.. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ నగరంలోనూ వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.


Also Read: NASA SpaceX: ఐఎస్ఎస్ చేరిన స్పేస్‌ఎక్స్ క్రూ3.. మిషన్‌ను నడిపించిన తెలుగోడు.. ఆస్ట్రోనాట్ రాజాచారి ఎవరో తెలుసా!


కుండపోత..
వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో అత్యథికంగా 18.4 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. చిత్తూరు జిల్లాలో గరిష్టంగా 14.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. గాలుల తీవ్రతకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో రైల్వే సిగ్నల్ వ్యవస్థ దెబ్బతినడంతో నెల్లూరు - చెన్నై, నెల్లూరు - రేణిగుంట రూట్లలోని పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 


భారీగా పంట నష్టం
భారీ వర్షాలకు నెల్లూరు, చిత్తూరు, గోదావరి జిల్లాల్లో పంట నష్టం జరిగింది. 10మండలాల్లో వెయ్యి ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్టు అంచనా. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నెల్లూరు జిల్లాలో 8 చోట్ల పునరావాస కాలనీలు ఏర్పాటు చేసి 400మందికి అక్కడ రక్షణ కల్పించారు. పునరావాస కాలనీల్లో ఆశ్రయం పొందిన బాధితులకు రూ.1000 చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఇదివరకే సీఎం జగన్ ప్రకటించారు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి