ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో పొడి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.
‘‘ఆంధ్రప్రదేశ్, యానాంలో తక్కువ ఎత్తులో ప్రధానంగా ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా వచ్చే మూడు రోజుల వరకూ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితిని ఇలా ఉండనుంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వచ్చే 3 రోజులు వాతావరణం పొడిగా ఉండనుంది. దక్షిణ కోస్తా, యానాం ప్రాంతాల్లో నూ వాతావరణ పొడిగానే ఉండనుంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగా ఉంటుంది. వర్షాలకు సంబంధించిన గానీ, ఎండలకు సంబంధించిన గానీ ఎలాంటి హెచ్చరికలూ లేవు’’ అని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు.
‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తూర్పు తెలంగాణ రాష్ట్రంలోని చాలా భాగాల్లో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలోని జగ్గంపేట - తాడేపల్లిగూడం పరిధిలో, తెలంగాణ భద్రాచలం, సూర్యాపేట, ఖమ్మంలో ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. ఈ ఎండల తీవ్రత ఉండగా, మనం నీటిని తాగడం చాలా మంచిది. మార్చి 13 నుంచి ఎండలు మరింత ఎక్కువ అవుతాయి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
తెలంగాణలో ఇలా.. (Telangana Weather Update)
తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడం జిల్లాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉండనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మార్చి 13 నుంచి వడగాల్పులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 33, 34 డిగ్రీల మేర నమోదు అవుతున్నాయి.