Weather Updates: ఏపీకి జవాదు తుపాను ముప్పు తప్పినా.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ఉత్తర ఒడిషా తీరానికి దగ్గరగా 70 కి.మీ దూరంలో, తూర్పు-ఈశాన్య చాంద్‌బాలీకి 65 కి.మీ దూరంలో తూర్పు-ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. మరో 6 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలహీన పడనుందని భారత వాతావరణ కేంద్రం సోమవారం తెల్లవారుజామున వెల్లడించింది. జవాద్ తుఫాను అల్పపీడనంగా బలహీనపడినా మరో రెండు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. నిన్న పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ ప్రాంతం, ఒడిశా తీర ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని ప్రభావితం చేశాయి. దక్షిణ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో మంగళవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఈశాన్య దిశగా ఒడిశా తీరం వెంట ప్రయాణించి పశ్చిమ బెంగాల్ తీరం చేరుకోనుంది. జవాద్ తుపాను బలహీనపడినా ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంద్ర, యానాంలలో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
దక్షిణ కోస్తాంధ్రలో నేటి నుంచి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమకు ఎలాంటి వర్ష సూచన లేదు. అయితే వాతావరణం పొడిగా ఉంటుందని, ఉష్టోగ్రత భారీగా పెరుగుతుందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన రాయలసీమ ప్రాంతం ఇప్పుడిప్పుడే వరదల నుంచి కోలుకుంటోంది. ఉత్తరాంధ్రలో తీరం వెంట వేగంగా గాలులు వీస్తాయి. మత్స్యకారులు మరో రెండు రోజుల వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Also Read: Gold-Silver Price: మరోసారి పెరిగిన బంగారం ధర.. వెండి నిలకడగా.. నేటి తాజా ధరలివీ..
తెలంగాణలో ఇలా..
తెలంగాణపై జవాద్ తుపాను ప్రభావం ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఖమ్మం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానుండగా.. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో కనిష్టంగా 14.2 డిగ్రీలకు పడిపోతున్నాయి. హైదరాబాద్‌లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు చెప్పారు.
ఢిల్లీ, దాద్రి, గ్రేటర్ నోయిడా, ఫరిదాబాద్, బల్లాభ్ గఢ్, మెహమ్, రోహ్‌తక్, పల్వాల్, హరియానాలోని హోడల్, హస్తినాపుర్, చందాపూర్, మీరట్, అమ్రోహ లాంటి ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. దక్షిణ బెంగాల్ జిల్లాలైన నార్త్ మరియు సౌత్ 24 పరగణాలు, పర్బా, పశ్చిమ మెదినీపూర్, ఝర్‌గ్రామ్, కోల్‌కతా, హుగ్లీ, బీర్భూమ్, బంకురా, నాడియాలలో నేడు మరోసారి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!