AP Weather Updates: అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం ప్రాంతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.


వాయుగుండం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1,020 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వాయవ్య దిశగా ప్రయాణిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించనుంది. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా- దక్షిణ ఒడిశా తీరానికి చేరుతుంది. మరోవైపు నేడు తుపాను (జవాద్‌గా పిలుస్తున్నారు)గా మారే అవకాశం ఉంది. నేటి సాయంత్రం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉండటంతో విద్యుత్తు స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ సూచించాయి.


తూర్పు గోదావరి జిల్లాకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు మరో రెండు రోజులపాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇదివరకే సముద్రంలో వేటకు వెళ్లిన వారి వెంటనే తీరానికి చేరుకునేలా చర్యలు చేపట్టాలని మత్య్సశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అల్పపీడనం మరో 12 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆపై వాయువ్య దిశలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించి డిసెంబర్ 4వ తేదీలోగా ఉత్తర కోస్తాంధ్ర - దక్షిణ ఒడిశా తీరానికి చేరుతుందని అంచనా వేశారు. ఇక్కడి నుంచి ఉత్తర ఈశాన్య దిశలో ప్రయాణించడంతో వర్షపు ముప్పు పొంచి ఉంది. 
Also Read: East Godavari: జవాద్ తుపానుతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం... వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు... కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు


ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో నిన్న వాతావరణం కొస్త పొడిగా ఉంది. నేటి నుంచి మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవయనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను సంభవించే నేపథ్యంలో గంటకు 80 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందన ప్రజలు అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని.. లేనిపక్షంలో వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.


దక్షిణ కోస్తాంధ్రలో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇటీవల కురిసన భారీ వర్షాలకు అతలాకుతలమైన రాయలసీమలోనూ రెండు, మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో రాయలసీమలోని కొన్ని చోట్ల ఓమోస్తరు వర్షాలు కురవనుండగా.. ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.


పలు రైళ్లు రద్దు..
తుపాను ప్రభావంతో నేడు బయలుదేరే పలు రైళ్లను ద.మ.రైల్వే రద్దు చేసినట్లు డివిజనల్‌ రైల్వే అధికారి తెలిపారు. హౌరా-సికింద్రాబాద్‌ మధ్య నడవనున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌(12703), సికింద్రాబాద్‌-హౌరా మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌(12704), సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్‌(17016), భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్‌(17015) రైళ్లను నిలిపివేసినట్లు ప్రకటించారు.


తెలంగాణలో పొడిగా వాతావరణం..
అండమాన్ సముంద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తెలంగాణపై అంతంతమాత్రంగా ఉంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తుండగా.. తెలంగాణలో పగతి ఉష్ణోగ్రతలు దిగొచ్చాయి. మధ్యాహ్నం వరకు చల్లని గాలులు వీస్తున్నాయి. అందులోనూ చలికాలం కావడంతో జిల్లాల్లో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read: ఏపీ, ఒడిశాపై జవాద్ తుపాను ప్రభావం... 100కు పైగా రైళ్ల రద్దు... ప్రధాని మోదీ సమీక్ష


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి