Weather Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా వర్షాలు ముంచెత్తాయి. తాజాగా ఏపీలో వాతావరణం పొడిగా మారనుంది. వర్షాలు తగ్గినా కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం అలాగే ఉన్నాయి. చలి తీవ్రత నేటి నుంచి క్రమంగా తగ్గుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని రోజులుగా వీస్తున్న ఈశాన్య గాలులు తగ్గుముఖం పట్టగా.. ప్రస్తుతం ఉత్తర దిశ నుంచి బలమైన గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం (పుదుచ్చేరి)లలో వర్షాలు తగ్గడంతో వాతావరణం పొడిగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి మరో రెండు రోజులపాటు కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎలాంటి వర్ష సూచన లేదు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య ఉండదని అధికారులు సూచించారు. అకాల వర్షాలు తగ్గడంతో రైతులు ఆరు బయట ఉంచిన ధాన్యం తడిసిపోతుందని ఆందోళన చెందనక్కర్లేదు. అయితే ధాన్యం నిల్వపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కళింగపట్నం, నందిగామలో కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల కన్నా తక్కువగా నమోదైంది. అయితే నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
రాయలసీమలో..
రాయలసీమలోనూ వర్షాలు కురిసే అవకాశం లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి రెండు రోజులపాటు రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఏపీలో చలి ప్రభావం ఇంకా తగ్గలేదు. ఆరోగ్యవరంలో కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలు కాగా, కర్నూలులో 17.7 డిగ్రీలు, నంద్యాలలో 18.2 డిగ్రీలు, తిరుపతిలో 19 డిగ్రీలు నమోదైంది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో గత వారం రోజులుగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. తెలంగాణను దట్టమైన మేఘాలు కమ్మేస్తున్నాయి. కానీ ఎలాంటి వర్ష సూచన లేదని స్పష్టం చేశారు. మరో రెండు రోజులపాటు హైదరాబాద్, పలు జిల్లాల్లో చాలా చోట్ల వాతావరణం పొడిగా ఉండనుంది. రెండు రోజుల తరువాత మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Also Read: ఈ రాశివారు ఈ రోజు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చొద్దు, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి..
Also Read: షాకింగ్ న్యూస్.. నేడు దారుణంగా పెరిగిన బంగారం ధర, వెండి కూడా మరింత పైపైకి.. ఇవాల్టి ధరలు ఇవే..