Weather Condition in Telugu States: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకూ ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 17 కి.మీ వేగంతో ఉత్తరదిశగా కదులుతున్నట్లు అమరావతి వాతావరణ విభాగం పేర్కొంది. పశ్చిమబెంగాల్‌కు ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని.. శనివారం రాత్రికి ఇది తుపానుగా మారి ఆదివారం అర్ధరాత్రికి సాగర్ ద్వీపం - ఖేపుపారా మధ్య తీరం దాటుతుందని అధికారులు తెలిపారు. ఈ తుపాను ప్రభావం ఏపీపై లేదని చెప్పారు. ద్రోణి కారణంగా రాగల రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఆ తర్వాత వాతావరణం పొడిగా ఉంటుందని అన్నారు. అటు, నైరుతి రుతు పవనాలు సైతం అరేబియా సముద్రంలోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి. ఈ నెల 31లోగా ఇవి మరింతగా పురోగమించి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.


ఈ ప్రాంతాల్లో వర్షాలు


ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అటు, విజయవాడలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులన్నీ జలమయం కాగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బెంజి సర్కిల్, మొఘల్రాజపురం, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. అలాగే, అనంత జిల్లా కల్యాణదుర్గంలో అత్యధికంగా 86.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పలు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రాయదుర్గం, కనేకల్, బొమ్మనహాల్ మండలాల్లో భారీ వర్షాలతో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. కర్నూలు జిల్లాలోనూ ద్రోణి ప్రభావంతో భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించక మునుపే ముందస్తు వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు, కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్రం అల్లకల్లోలంగా ఉంది. శనివారం ఉదయం సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.


తెలంగాణలో ఇదీ పరిస్థితి


అటు, తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అలాగే, ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు.


Also Read: Revanth Reddy: తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినపడొద్దు: తొలి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి