Ramagiri Gold Mines : అనంతపురం జిల్లాలోని రామగిరి బంగారు గనులకు సంబంధించి త్వరలోనే కాంపొజిట్ లైసెన్స్ లకు టెండర్లు పిలవనున్నట్లు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వపరంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని, ఈ నెలాఖరు లోపు టెండర్లు పిలుస్తామని తెలిపారు. అందుకే ముందుగానే పలు కంపెనీలు రామగిరి గనులను పరిశీలించాయని, మంగళవారం అమెరికాకు చెందని హోప్ అండ్ మాన్ హటన్స్ కంపెనీ ప్రతినిధులతో కలిసి రామగిరి బంగారు గనులను పరిశీలించానన్నారు ప్రకాశ్ రెడ్డి. రామగిరి గోల్డ్ మైన్స్ లోనే నార్త్, సౌత్ బ్లాక్లో రెండు వేల హెక్టార్లకు కాంపొజిట్ లైసెన్స్ లకు టెండర్లు సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో మంత్రిగా ఉన్న పరిటాల సునీత ఎందుకు ఈ గనులను తెరిపించలేకపోయారని తోపుదుర్తి ప్రశ్నించారు. గత ప్రభుత్వ హాయాంలో కర్నూలు జిల్లాలో జొన్నగిరి మైన్స్ ను తెరపించినప్పడు, రామగిరి గనులను ఎందుకు తెరిపించలేదంటూ ప్రశ్నించారు. అత్యంత క్వాలిటీ ఉన్న బంగారు గనులని గతంలో కూడా ఎన్ఎండీసీ ఈ మేరకు నిర్దారించిందన్నారు. అందుకే చాలామంది టెండర్లకు సిద్ధం అవుతున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం రామగిరిలోని గోల్డ్ మైన్స్ ను అమెరికాకు చెందిన ప్రతినిధులతో కలిసి తోపుదుర్తి పరిశీలించారు.
జాకీ కంపెనీ వెళ్లిపోవడం వెనుక
జాకీ కంపెనీ తరలివెళ్లడం వెనుక తన పాత్ర ఉందంటూ పరిటాల సునీత చేస్తున్న ఆరోపణలు హాస్యస్పదమని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కొట్టిపారేశారు. గత ప్రభుత్వ హయాంలోనే 42 ఎకరాలను కేవలం రూ. మూడుకోట్లుకు కేటాయిస్తే పరిటాల కుటుంబం అది దాదాపుగా రూ.150 కోట్ల విలువ చేసే భూమి అని కంపెనీ ప్రతినిధులను బెదిరిస్తే ఈ ప్రాంతం వద్దని వెళ్లిపోయారని విమర్శించారు. కానీ వాస్తవాలను దాచిపెట్టి జాకీ పరిశ్రమ వెళ్లిపోవడం వెనుక మేము ఉన్నామని పరిటాల కుటుంబం చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు ప్రకాశ్ రెడ్డి. 2018లోనే జాకీ పరిశ్రమ ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోతుందంటూ అప్పట్లో వచ్చిన కథనాలను ఆయన చూపించారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు ఆపాలంటూ పరిటాల కుటుంబాన్ని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. వీరి అత్యాశకు జాకీ పరిశ్రమ వెళ్లిపోతే టెక్స్ పోర్ట్ కంపెనీని తీసుకువస్తున్నామన్నారు. నాలుగు వేల మందికి మొదట విడతలో ఉద్యోగాల లక్ష్యంగా టెక్స్ పోర్ట్ కంపెనీ రానుందన్నారు. పరిటాల కుటుంబం ధనదాహానికి, కుటుంబ పాలనకు రాప్తాడు నియోజకవర్గం అస్తవ్యస్తం అయితే వాటిని సరిదిద్దేందుకు తలనొప్పిగా తయరైందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పేరూరు డ్యామ్ కు నీరు తెచ్చే పేరుతో రూ.800 కోట్ల టెండర్లు పిలిస్తే, వైసీపీ ప్రభుత్వమం ఐదు కోట్లతో పేరూరు డ్యామ్ కు నీటిని ఇచ్చిందన్నారు.