2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే వారిమన్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి. కాంగ్రెస్ హయాంలోనే పోలవరం ప్రాజెక్టును అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని గుర్తు చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలో ఆయన మాట్లాడారు. 2014 వరకు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 80 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామన్నారు రఘువీరారెడ్డి.  బిజేపి, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు  దాగుడుమూతలు ఆడుతూ పోలవరం ప్రాజెక్టును ఇప్పటి వరకు పూర్తి చేయలేదని మండిపడ్డారు. 2014 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే,  2019 చివరికి నాటికి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసే వారిమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి, ప్రాజెక్టుకు ఎంత వ్యయమైనా ఆరు నెలల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.  లేదంటే I.N.D.I.A కూటమి అధికారం చేపట్టిన  2 సంవత్సరాల్లోనే ప్రాజెక్టు పనులను పూర్తి చేసి, చివరి గ్రామం వరకు త్రాగునీరు అందిస్తామన్నారు.


తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు రఘువీరారెడ్డి. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి వ్విక్రమార్క సంతకాలు చేసిన గ్గ్యారెంటీ కార్డులను, ప్రతి ఇల్లు చేరిస్తే కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందన్నారు. తెలంగాణలో కేసిఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రయోజనం ఉండదన్నారు రఘువీరారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో తీసుకొన్న నిర్ణయాలు, హైదరాబాదులో CWC తీసుకొన్న నిర్ణయాలు అమలు జరగాలని, వాటితోనే భారతదేశానికి మేలు జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.