Chandrababu Case :   స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం నాడు   తీర్పును వెలువరిస్తామని జడ్జి ప్రకటించారు. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ  సుప్రీంకోర్టులో సోమవారం జరగనుంది.  సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఏసీబీ కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.  కోర్టులో ప్రభుత్వం తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. మొత్తంగా మూడు రోజుల పాటు వాదనలు జరిగాయి.                    
 
స్కిల్ డెవలప్‌మెంట్  కేసులో  మూడో రోజు సీఐడీ తరుపున  ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.  పొన్నవోలు వాదనలకు కౌంటర్‌గా చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని, ఆయన బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకోవాలని పొన్నవోలు సుధాకర్ కోరారు. ఇప్పటికే ఆదాయపన్ను వివరాలు కూడా తీసుకున్నామని, సీఐడీ అధికారులు విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. వాటిలో చంద్రబాబు పాత్ర, ఇతరులకు డబ్బు పంపిణీ అంశాలపై విచారణ చేయాలని అన్నారు. అందుకే ఐదు రోజుల కస్టడీ కోరుతున్నామని పొన్నవోలు అన్నారు.                


కస్టడీకి ఇవ్వాలన్న ఏఏజీ వాదనలపై చంద్రబాబు తరుపు న్యాయవాది దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. కస్టడీకి కోరడం పసలేని వాదనలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారని, విచారణలో చంద్రబాబు సహకరించారని కోర్టుకు వివరించారు. కస్టడీ ముగిసినా ఇప్పటివరకు కేసు డైరీ సమర్పించలేదని న్యాయవాది దూబే వాదించారు. దీంతో కేసు డైరీ ఎక్కడ ఉందని సీఐడీ అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించారు.             


 ఇప్పటికే మూడు రోజుల నుంచి ఏ రోజుకారోజు వాదనలు ముగిసి తీర్పు వస్తుందని ఆశించినప్పటికీ.. ఇరువురు న్యాయవాదుల మద్య తీవ్రస్థాయిలో వాదోపవాదనలు జరిగాయి. అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. గత కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా న్యాయవాదులు ప్రస్తావించారు. మొన్న మొదలైన వాదనలు శుక్రవారం మధ్యాహ్నంతో ముగిసాయి. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ మేరకు వాయిదా వేశారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు  పిటిషన్ పై విచారణ పూర్తయి తీర్పు వస్తే  దానికి తగ్గట్లుగానే కోర్టులు తీర్పులు వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.  చంద్రబాబు తరపు లాయర్లు వాదిస్తున్నట్లుగా ఆయనకు 17A వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెబితే...  ప్రస్తుతం కోర్టుల్లో ఉన్న పిటిషన్లు ఏవీ చెల్లుబాటు కావు. అందుకే దిగువ కోర్టులు తర్పులన్నీ రిజర్వ్ చేశాయని భావిస్తున్నారు. ఫైబర్ గ్రిడ్  , అంగళ్లు కేసు,, ఐఆర్ఆర్ కేసుల్లో ముందస్తు బెయిల్ పై హైకోర్టులో చంద్రబాబు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి.