Vyooham Director Ram gopal Varma:
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సమాజానికి ఏం చేశాడు? ఏపీ రాష్ట్రాభివృద్ధికి ఏం చేశాడు? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. తనపై లోకేష్ చేసిన కామెంట్లపై వ్యూహం సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో బదులిచ్చారు. నారా లోకేష్ ను చూసి జాలి పడాలా, నవ్వాలో అర్థం కావడం లేదన్నారు.
తాను ఫిల్మ్ మేకర్ అని, సినిమాలు తీయడం తన పని అంటూ టాలీవుడ్ డైరెక్టర్ ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు. మీలాగ నేను జనం కోసం పుట్టాను, పెరిగాను, జనం కోసమే చనిపోతాను లాంటి మాటలు చెప్పలేదంటూ లోకేష్ పై సెటైర్లు వేశారు. ఇప్పటివరకూ అలాంటి మాటలు ఎప్పుడైనా చెప్పానా అంటూ లోకేష్ ను ట్విట్టర్ (ఎక్స్)లో వీడియో ద్వారా ప్రశ్నించారు. లోకేష్ తనను విమర్శించడాన్ని వర్మ స్వాగతించారు. అయితే ఏ పాయింట్ మీద తనను విమర్శించాలో కూడా లోకేష్ కు క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. తనను విమర్శించడానికి ఏపీ అభివృద్ధిలో వర్మ పాత్ర లాంటి పిచ్చి విషయాలు మాట్లాడనన్నారు.
ఒకవేళ తాను లోకేష్ స్థానంలో ఉంటే.. వాడు (వర్మ) పిచ్చోడు, హిట్ సినిమా తీసి ఎన్నిరోజులు అయింది, అలాంటి వ్యక్తి గురించి తాను స్పందించడం అవసరం లేదని అంటానన్నారు. అసభ్యకరమైన సినిమాలు తీస్తాడు, అడ్డదిడ్డంగా సినిమాలు చేస్తాడు. ఆ వీడియోలు చూస్తాడు. అలాంటి పర్సన్ గురించి స్పందించం వేస్ట్ అని చెబుతానన్నాడు వర్మ. ఇంత విషయం తెలియకపోతే ఎలా బేబీ అని లోకేష్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. తన లైఫ్ ఓపెన్ బుక్ అని, వెనకాల అమ్మాయిల ఫొటోలు చూస్తే అర్థమవుతుంది అన్నారు. నీలాగ (లోకేష్) లాగ స్విమ్మింగ్ పూల్ లో అమ్మాయిలతో ఉన్న ఫొటోలు ఎక్కడో దాచిపెట్టే రకం తాను కాదన్నారు. అయితే చంద్రబాబు ప్రస్తుత పరిస్థితి చూసి లోకేష్ మానసిక పరిస్థితి సరిగా లేదేమో.. దానిపై ఎక్స్ పర్ట్స్ ను సంప్రదించాలని ఆర్జీవీ సూచించారు.
నాలాంటి వాడిని ఏ విషయంపై విమర్శించాలో కూడా తెలియకపోతే మీ తండ్రి చంద్రబాబును దేవుడు కూడా కాపాడలేడు అంటూ లోకేష్ పై సెటైర్లు వేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినట్లు లండన్ లాంటి చోటుకు వెళ్లి థోరపీ చేయించుకుంటే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. చిన్న చిన్న విషయాలకే హైరానా పడకూడదంటూ లోకేష్ కు విలువైన సలహా ఇచ్చానంటూ వీడియోను ముగించారు ఆర్జీవీ.
వర్మను లోకేష్ ఏమన్నారంటే..
చంద్రబాబు ఏపీ అభివృద్ధికి పాటుపడ్డారు, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ సమాజానికి, ఏపీ అభివృద్ధి కోసం ఏం చేశారని లోకేష్ మీడియాను ప్రశ్నించారు. చంద్రబాబు సైబరాబాద్ తయారు చేశారు, ఏపీ విభజన తరువాత నవ్యాంధ్రకు రాజధాని ఏర్పాటు చేశారని చెప్పారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారు. కియా మోటార్స్, టీసీఎస్ లాంటి ఎన్నో సంస్థలను తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించారని లోకేష్ అన్నారు.