Vontimitta Kodandarama Swamy: తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) అనుబంధంగా ఉన్న కడప జిల్లా ఒంటిమిట్టలోని పురాతన, చారిత్రక ప్రాశస్త్యం గల శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు వృషభలగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజ స్తంభానికి నవకలశ పంచామృత అభిషేకం చేసి ఇంద్రాది సకల దేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. 


ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు. అదేవిధంగా, మధ్యతాళం - నాదనామక్రియా రాగం, భృంగిణి తాళం - లలిత రాగం, చంపక తాళం - భైరవి రాగం, ఏకతాళం - మలయమారుత రాగం, త్రిపుట తాళం - మేఘరంజని రాగం, రూపక తాళం - వసంతభైరవి రాగం, గంధర్వ తాళం - కింకర రాగం, నంది తాళం - శంకరాభరణం రాగం, గరుడ తాళం - ఆనందవర్ధన రాగం ఆలపించారు. కంకణబట్టర్‌ కెహెచ్. రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది.


ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయినట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ 13న హనుమంత వాహనం, ఏప్రిల్ 14న గరుడ సేవ, ఏప్రిల్ 15న కల్యాణోత్సవం, ఏప్రిల్ 16న రథోత్సవం, ఏప్రిల్ 18న చక్రస్నానం జరుగుతాయని తెలిపారు. 


పట్టువస్త్రాల సమర్పణ
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సీతారామ లక్ష్మణులకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ అమరనాథ రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ డాక్టర్ రమణ ప్రసాద్, శ్వేత, సంచాలకులు ప్రశాంతి, ఏఈఓ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఆర్.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.